నమిత ఇ-మెయిల్ సందడి
ఇ-మెయిల్ అకౌంట్లు చెక్ చేసేందుకు లాగిన్ అయిన లక్షలాది మంది నెటిజన్లు కొద్దిరోజులుగా షాక్ తింటున్నారు. ఇది ఆశ్చర్యంతో కూడిన షాక్ లెండి. తమిళంలో వివపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగి దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్న గ్లామర్ నటి నమిత నుంచి ఇ-మెయిల్స్ వస్తుండటమే ఇందుకు కారణం. న్యూస్ లెటర్ రూపంలో యాక్ట్రస్.నమిత2002@జిమెయిల్.కామ్' అనే మెయిల్ ఐడి నుంచి ఈ ఇ-మెయిల్స్ వస్తున్నాయి. తాను నటించగా జూలై 10న విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇంద్రవిళ' చిత్రాన్ని తప్పనిసరిగా చూడాలని నమిత ఈ న్యూస్ లెటర్ లో కోరుతోంది. నమిత తమకు ఇ-మెయిల్స్ పంపడం అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, నిజంగా నమితే ఇ-మెయిల్స్ పంపి ఉంటుందా అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నమిత పేరిట ఈమధ్యన ఓ 'వైరస్' నెట్స్ లోకి పంపినట్టు వస్తున్న వార్తలూ వీరిని ఆలోచింపజేస్తున్నాయి. ఇక ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకోవడానికి లేకుండా ఆ మాసం ఇప్పటికే వచ్చి వెళ్లిపోయింది. దీంతో పలువురు నమిత పేరిట వచ్చిన ఇ-మెయిల్స్ ను తొలగించడమో, ఆ జోలికే వెళ్లకపోవడమో చేస్తున్నారు. దీంతో ఏమాత్రం జాప్యం కాకుండా నమితను ఈ విషయమై సంప్రదించినప్పుడు 'ఇ-మెయిల్స్ పంపింది నేనే. ఐడియా మాత్రం ఇంద్రవిళ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సంజీవ్ శర్మది' అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.
నమిత మరింత వివరిస్తూ 'ఒకరోజు ఇంద్రవిళ సినిమా ప్రమోషన్ గురించి నేనూ, నిర్మాతా ముచ్చటించుకుంటున్నాం. అకస్మాత్తుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నటిగా నాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రమోషన్ ఎందుకు చేపట్టకూడదని ఆయన నన్ను ప్రశ్నించారు. ఒకేసారి వేలాది మందికి ఇ-మెయిల్స్ ఎలా పంపాలనేది వివరించారు. ఆయన ఐడియా నాకు ఎంతో బాగా నచ్చింది. జనాలకు మరింత దగ్గరకావాలంటే ఇదో వినూత్నమైన మార్గమనే అభిప్రాయం కలిగింది. అప్పట్నించీ తీరిక చేసుకుని సొంతంగానే ఈ న్యూస్ లెటర్ ను డిజైన్ చేశాను. తమిళ, ఇంగ్లీషు పదాలను బాగా మిక్స్ చేసి టాంగ్లిష్ భాషలో ఈ న్యూస్ లెటర్ ఉంటుంది' అన్నారు. సుమారు 20 లక్షల ఇ-మెయిల్స్ పంపాననీ, తాను మెయిల్ ఇచ్చిన గంటలోనే 22,000 మందికి పైగా జనం తనకు రిప్లయ్ ఇవ్వడం తనను సంబరంలో ముంచెత్తిందనీ చెప్పుకొచ్చింది. నమిత ఇక్కడతో ఆగిందా? తనకు ఇ-మెయిల్ సమాధానం ఇచ్చిన వారిలో కొందరికి తక్షణమే తన రియాక్షన్ కూడా తెలియజేసిందట. సో...మీరూ జిమెయల్ అకౌంట్ ను చెక్ చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటే పోలా..?!
Be first to comment on this News / Article!
|