నిఖిల్-శ్వేతాబసు కొత్తచిత్రం
ఇద్దరూ రెండు హిట్లు ఖాతాలో వేసుకున్నారు. ఒకరు 'హ్యాపీడేస్', 'యువత' చిత్రాలతో కాగా, మరొకరు 'కొత్త బంగారులోకం', 'రైడ్' సినిమాలతో విజయపథంలో ఉన్నారు. ఈ ఇద్దరూ నిఖిల్, శ్వేతాబసు ప్రసాద్. ఈ జంటను కలుపుతూ సాయికృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై దొమ్మలపాటి శ్రీనివాసరావు ('ద్రోణ' ఫేమ్) ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ధనలక్ష్మి ప్రొడక్షన్స్ (శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి) ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సురేష్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ కొత్త చిత్రం వివరాలను హైద్రాబాద్ లో బుధవారం చిత్రయూనిట్ తెలియజేసింది. నిర్మాతలతో పాటు నిఖిల్, శ్వేతబసు కూడా పాల్గొన్నారు.
నిర్మాత డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, తమ బ్యానర్ లో వస్తున్న ఐదవ చిత్రమిదనీ, ఈ చిత్రం ద్వారా సురేష్ అనే తమిళ దర్శకుడిని తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమ చేస్తున్నామనీ చెప్పారు. మూడు నెలలు కష్టపడి ఈ స్క్రిప్టు రచన జరిగిందనీ, కథకు అనుగుణంగానే నిఖిల్, శ్వేతబుసులను ఎంచుకున్నామనీ తెలిపారు. నిఖిల్ కు హీరోగా ఈ చిత్రం చాలా పెద్ద పేరు తెచ్చిపెడుతుందన్నారు. జూలై 2వ వారం నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. నిఖిల్ మాట్లాడుతూ, తన గత చిత్రాలకంటే భిన్నంగా ఈ చిత్ర కథ ఉంటుందనీ, మంచి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా తన చేతికి వచ్చిందన్నారు. ఈ చిత్రంలో తాను మధ్య తరగతికి చెందిన కాలేజీ అమ్మాయిగా నటిస్తున్నానని శ్వేతబసు ప్రసాద్ తెలిపింది. మంచి కథ, ఆర్టిస్టులు లభించారనీ, త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని చిత్ర సమర్పకులు తెలిపారు.
Be first to comment on this News / Article!
|