'అమాయకుడు' మొదలు
'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు కథానాయకుడుగా 'అమాయకుడు' అనే కొత్త చిత్రం ప్రారంభమైంది. కృష్ణుడుకు జోడిగా అనన్య నటిస్తోంది. భారతీగణేష్ దర్శకత్వంలో ఎం.బాలమురుగన్, అనిల్ ఎస్.నాయర్, సుదర్శన్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆదివారంనాడు ఈ చిత్రం ప్రారంభమైంది. కృష్ణుడుపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి నిర్మాత అనిల్ ఎస్.నాయర్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు భారతీ గణేష్ గౌరవ దర్శకత్వం వహించారు.
కృష్ణుడు మాట్లాడుతూ, 'వినాయకుడు' తర్వాత యాభై కథలు విన్నాననీ, తనకు నచ్చిన సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాననీ చెప్పారు. మంచి హ్యూమర్ ఉన్న ఫ్యామిలీ లవ్ స్టోరీ ఇదనీ, మంచి నిర్మాతలు, చక్కటి టీమ్ దొరకడం ఆనందంగా ఉందనీ అన్నారు. తమిళంలో సూపర్ గుడ్ సంస్థ నిర్మించిన 'కన్నుబడబోగుదయ్యా' దర్శకుడిగా తన తొలిచిత్రమని భారతీ గణేష్ పేర్కొన్నారు. వైవిధ్యమైన చిత్రంతో తెలుగులో పరిచయం కావాలనుకున్నప్పుడు 'వినాయకుడు' సినిమా చూశాననీ, అలాంటి ప్రయోగం మనమెందుకు చేయకూడదనే ఆలోచకు కార్యరూపమే ఈ 'అమాయకుడు' చిత్రమని చెప్పారు. ఇంట్లో వాళ్లతో తిట్లుతినే ఓ అమాయకుడైన యువకుడు అసాధ్యుడుగా ఎలా మారాడన్నదే ఈ చిత్ర కథ అనీ, ప్రేమ ఈ కథకు కేంద్రబిందువనీ తెలిపారు. ఈరోజు నుంచి ఆగస్టు 31 వరకూ నిరవధికంగా జరిగే షూటింగ్ తో సినిమా పూర్తవుతుందని మరో నిర్మాత బాలమురుగన్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, రావు రమేష్, రక్ష, గీతాసింగ్, అలేఖ్యరావు తదితరులు నటిస్తున్నారు. ఘటికాచలం మాటలు, వనమాలి పాటలు, ఉమాశంకర్ సినిమాటోగ్రఫీ, మణికాంత్ కాద్రి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|