గోపీచంద్ తో దిల్ రాజు చిత్రం
ఎగ్రెసివ్ హీరోగా గోపీచంద్ ఇవాల్టి మాస్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు. 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం' వంటి హిట్స్ తో విజయపథంలో దూసుకుపోతున్నారు. 'శౌర్యం' శివ దర్శకత్వంలోనే ప్రస్తుతం 'శంఖం' అనే చిత్రంలో గోపీచంద్ ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తొలిసారి కథానాయికగా త్రిష నటిస్తుండటం కూడా ఈ చిత్రంపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ తో ఓ భారీ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
దిల్ రాజు తీసిన సినిమాల్లో 'మున్నా' చిత్రం మినహాయిస్తే మిగిలినవన్నీ మంచి హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఆయన ఒకేసారి నాలుగుగైదు చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. ఆయన నిర్మాతగా నాగచైతన్య తొలిచిత్రమైన 'జోష్' చిత్రం నిర్మాణంలో ఉండగా, వరుణ్ సందేష్ తో 'మరో చరిత్ర', ప్రభాస్-దర్శకుడు దశరథ్ కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వీటికితోడు ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం కూడా ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా గోపిచంద్ హీరోగా ఓ కొత్త చిత్రానికి కూడా దిల్ రాజు రెడీ అవుతున్నారు. గోపీచంద్ చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన గోపి అనే వ్యక్తిని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రం ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|