దక్షిణాదికే ప్రాధాన్యం: త్రిష
ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన 'ఖట్టా మీఠా' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నట్టు త్రిష ఇటీవల ప్రకటించింది. అప్పట్నించీ ఆమె తన చేతిలోని తమిళ సినిమాలు వదుల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వదంతులు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేననీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదనీ త్రిష తాజాగా వివరణ ఇచ్చింది.
ప్రస్తుతం తాను నటిస్తున్న తమిళ చిత్రాలకు సంబంధించి నిర్మాతలతో కానీ, దర్శకులతో కానీ, నటులతో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవనీ, ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికే తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటాననీ త్రిష పేర్కొంది. 'ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒప్పుకున్న సినిమాకి డేట్లు అడ్జెస్ట్ చేయడానికే నేను ప్రయత్నిస్తుంటాను. ఒకవేళ అది సాధ్యం కానప్పుడు ప్రొఫెషనల్ గానే ఆ సినిమాకు దూరమవుతుంటాం. ఒకటి మాత్రం స్పష్టం చేయదలచుకున్నాను. దక్షిణాది సినిమాలకే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది' అని త్రిష వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో తాను ఒప్పుకున్న గోపీచంద్, వెంకటేష్ చిత్రాలు రెండు నెలల్లో పూర్తి చేయబోతున్నాననీ, దాంతో బాలీవుడ్ లో తాను తొలిసారి నటించబోయే 'ఖట్టా మీఠా' చిత్రానికి తగినంతం సమయం చిక్కుతుందనీ చెప్పింది. హిలేరియస్ కామెడీతో ఆ సినిమా ఉండబోతోందనీ, తనలోని ప్రతిభను ప్రియదర్శన్ సమర్ధవంతంగా రాబట్టగలడనే గట్టి నమ్మకంతోనే ఈ చిత్రానికి అంగీకరించినట్టు చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్ తో కామిక్ టైమింగ్ పండించే విషయంలో శక్తివంచన లేకుండా కష్టపడతాననీ, నిజానికి కామెడీకి మాత్రమే కాకండా ఇతర కీలక మైన అంశాలు కూడా సినిమాలో ఉంటాయనీ త్రిష తెలిపింది.
Be first to comment on this News / Article!
|