అల్లు అర్జున్ తో సింగీతం
సింగీతం శ్రీనివాసరావు గురించి తెలియని వారుండరు. 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం', 'విచిత్ర సోదరులు', 'మైఖేల్ మదన కామరాజు' వంటి ఎన్నో విలక్షణ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 78 ఏళ్ల ప్రాయంలోనూ చెక్కుచెదరని ఆత్మస్థైర్యం, చురుకుదనం ఆయన సొంతం. 'ఘటోత్కచ' వంటి యానిమేషన్ చిత్రంతో ఇటీవల అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు 'త్యాగయ్య' చిత్రానికి ఆయన ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరంగా ఇప్పుడు నటుడిగా కూడా ఆయన తొలిసారి ఓ పూర్తి స్థాయి పాత్రను పోషిస్తున్నారు. స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు.
సింగీతం శ్రీనివాసరావు గతంలోనూ ఒకటి రెండు చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించినప్పటికీ తొలిసారి పూర్తి నిడివి ఉన్న పాత్రను పోషిస్తుండటం ఇదే ప్రథమం. ఈ చిత్రంలో పాత, కొత్త నటీనటులు లెక్కకు మిక్కిలిగా నటిస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఓ వివాహం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇందుకోసం ఆమధ్యన టాలెంట్ హంట్ ను కూడా గుణశేఖర్ నిర్వహించారు. గత జనవరిలో ప్రారంభమైన ఈ చిత్రం ప్రోగ్రస్ ను గుట్టుగా ఉంచుతున్నారు. ఆసక్తికరంగా క్రిష్ (రాధాకృష్ణ) దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క నటిస్తున్న చిత్రంలోనూ ఓ వృద్ధ నటుడి పాత్ర కీలకం కాబోతోంది. ప్రస్తుతం ఆ నటుడి ఎంపిక జరుగుతోంది. ఏతావాతా సీనియర్ సిటిజన్లయిన నటులకు తెలుగు సినిమాల్లో ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నట్టే ఉంది.
Be first to comment on this News / Article!
|