'ఆ ఇంట్లో' ఆడియో రిలీజ్
నటుడు చిన్నా కథానాయకుడుగా, దర్శకుడిగా యు9 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మిత్రులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'ఆ ఇంట్లో'. ఈ చిత్రం విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో మంగళవారంనాడు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకరత్న దాసరి నారాయణరావు ఆడియో క్యాసెట్లు, సీడీలను రిలీజ్ చేసి దిల్ రాజు, పూరీ జగన్నాథ్, సి.కల్యాణ్ తదితరులకు అందజేశారు. చిన్నా, ఆశా షైనీ, చిత్ర సంగీత దర్శకుడు కోటి, దేవన్న, సునీత, శ్రీనివాసరాజు, కృష్ణారెడ్డి, సునీల్, ఏవీఎస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ, చిన్నా ఎంతో ప్రతిభావంతుడైన నటుడనీ, అయితే అతని టాలెండ్ కు తగిన పాత్రలు దొరకలేదనీ అన్నారు. టాలెంట్ లేనివారెందరో పరిశ్రమలో వెలుగుతుంటే, టాలెంట్ ఉన్నప్పటికీ కొందరికి సరైన అవకాశాలు దొరకలేదనీ ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కష్టాన్ని నమ్ముకున్న వారు తప్పనిసరిగా విజయాలను చవిచూస్తారని అన్నారు. ఈ చిత్రంలోని పాటలు, క్లిప్లింగ్ కు చాలా బాగున్నాయని అన్నారు. ఈ చిత్రం తాను చూశాననీ, ముఖ్యంగా సెకెండాఫ్ చాలా బాగుందనీ దిల్ రాజు పేర్కొన్నారు. చిన్నా మంచి నటుడు మాత్రమే కాకుండా చక్కటి టెక్నీకిషన్ కూడాననీ, ఈ చిత్రంలోని దాదాపు అన్ని శాఖలూ చూసుకుంటూ ఈ సినిమా తీశారని అన్నారు. ఈ చిత్రం అతనికి మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. చిన్నా సినిమా తీస్తానని చెప్పినప్పుడు తాను నమ్మలేదనీ, అయితే కథ విన్న తర్వాత అతన్ని అభినందించకుండా ఉండలేకపోయాననీ, దర్శకుడిగా చిన్నాకు మంచి భవిష్యత్తు ఉందని సి.కల్యాణ్ పేర్కొన్నారు. ఈ చిత్రం 'అరుంధతి' తరహాలో చాలా పెద్ద హిట్టవుతుందని కోటి ధీమా వ్యక్తం చేశారు. రీ-రికార్డింగ్ కు దాదాపు నెలరోజులు పట్టిందన్నారు. ఈ చిత్రానికి మంచి ట్యూన్ ఇచ్చేందుకు చిన్నా తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. ఆరిస్టుగానే చిన్నా తనకు తెలిసినప్పటికీ అతని దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందనీ, అతను సినిమా తీసిన విధానం చూసి షాక్ అయ్యాననీ నటుడు ఏవీయస్ పేర్కొన్నారు. దర్శకుడుగా ఆయనకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. చిన్నా మాట్లాడుతూ, సినిమానే తన జీవితమనీ, దర్శకుడు కావాలని తాను ఎన్నడూ అనుకోలేదనీ తెలిపారు. తాను ఈ చిత్రకథతో చాలా మంది దర్శకులను సంప్రదించాననీ, అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో మిత్రుల సలహా ప్రకారం తానే దర్శకత్వం వహించాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. సినిమా ప్రారంభానికి ముందుకు పలువురు టెక్నీషియన్ల సలహాలు కూడా తీసుకున్నానని అన్నారు. ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాననీ, ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ రెడీ అయిందనీ చెప్పారు. తొలి కాపీ సిద్ధం కాగానే పాత్రికేయులకు ప్రదర్శించి వారి సలహాలు కూడా తీసుకుంటానని అన్నారు.
Be first to comment on this News / Article!
|