సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు పోషించడంలో సీనియర్ నటి సుహాసినికి మంచి పేరుంది. ఒకప్పుడు అగ్రహీరోలందరితోనూ హీరోయిన్ గా నటించిన సుహాసిని ఇవాల్టి నవతరం హీరోలకు తల్లి పాత్రల్లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ 'రాఖీ' చిత్రంలో లేడీ ఇన్ స్పెక్టర్ గా సుహాసిని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా ఆమె అల్లు అర్జున్ తల్లిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో సుహాసిని పాత్రకు మంచి ప్రాధ్యాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరంగా ఇదే చిత్రంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తొలిసారి ఓ పూర్తి నిడివి పాత్రను పోషిస్తున్నారు.
ఐదు రోజుల పాటు జరిగే ఓ వివాహం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. పాత, కొత్త తారలు 70 మందికి పైగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. గత జనవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు వచ్చినప్పటి నుంచి ప్రోగ్రస్ ను గుట్టుగానే ఉంచుతున్నారు. ఈ చిత్రం టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.