షామిలీ ఫస్ట్ లుక్ ఇదే...
నాలుగేళ్ల ప్రాయంలోనే మణిరత్నం 'అంజలి' చిత్రంలో మానసికంగా ఎదగని చిన్నారి పాత్రలో నటించి జాతీయ అవార్డును ఎగురేసుకుపోయిన బేబి షామిలి ఆ తర్వాత చిత్రాలతో స్టార్ స్టాటస్ ను కూడా అందిపుచ్చుకుంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలో చిరంజీవిని రాజు...రాజూ అంటూ ముద్దుగా పిలిచి అలరించిన బేబి షామిలి దాదాపు అన్ని దక్షిణాది భాషల్లోనూ నలభైకి పైగా చిత్రాల్లో నటించింది. పదేళ్ల ప్రాయంలో నటనకు స్వస్తి చెప్పి ఎడ్యుకేషన్ కే అంకితమైంది. సరిగ్గా పదేళ్ల తర్వాత ఇప్పుడు కుమారి షామిలిగా సరికొత్త అందాలతో తొలిసారి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను 'ఓయ్' చిత్రంతో పలకరించబోతోంది. సిద్దార్థకు జోడిగా షామిలి నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఆనంద్ రంగా తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆసక్తికరంగా ఇంతవరకూ పబ్లిసిటీ స్టిల్స్ లో దాగుడుమూతలాడిన షామిలి ఇప్పుడు కనిపించింది. ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేందుకు హీరోయిన్ ఫేస్ కనిపించకుండా ఇంతవరకూ జాగ్రత్త పడిన నిర్మాతలు తాజాగా షామిలీ ఫోటోలను, ట్రైలర్స్ ను రిలీజ్ చేశారు.
షామిలి నటన, లుక్స్ మన పక్కింటి అమ్మాయిని తలపించే విధంగా ఉంటాయనీ, ఆడియెన్స్ కు ఫ్రెష్ ఫీల్ కలిగించేందుకు ఇంతవరకూ షామిలి ముఖాన్ని ప్రేక్షకులను కనపించకుండా క్యూరియాసిటీ కలిగించామనీ నిర్మాత దానయ్య తెలిపారు. యూత్ ఫుల్ కథాంశంతో క్లీన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, సిద్దార్థ నటనతో పాటు షామిలి నటనను కూడా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారనీ ఆయన చెబుతున్నారు. జాతీయ ఉత్తమ నటితో తొలిసారి నటిస్తున్నాననే స్పృహతోనే చాలా కేర్ ఫుల్ గా నటించాననీ, షామిలి నటన అందర్నీ ఆకట్టుకోవడం ఖాయమని హీరో సిద్దార్ధ సైతం చెబుతున్నారు. బాలనటులుగా రాణించిన పలువురు సినీనటులు ఆ తర్వాత స్టార్ లుగా రాణించిన ఉదంతాలు పరిశ్రమలో చాలానే ఉన్నాయి. షామిలి కూడా అదే బాటలో హీరోయిన్ గా తొలి సక్సెస్ అందుకుంటుందా అనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది. ఈనెల 3న 'ఓయ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Be first to comment on this News / Article!
|