గుర్రంపై ఆర్పీ వెయిటింగ్!
నవ్వులరేడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా ఆంగ్లంలో రూపొందుతున్న 'క్విక్ గన్ మురుగన్'కు ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఫ్యాట్ షిప్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈమధ్యనే ముంబైలోని ఓ సెవన్ స్టార్ హోటల్ లో రాజేంద్ర ప్రసాద్, రష్యన్ భామలతో ఓ పాటను చిత్రీకరించారు. పనిలో పనిగా ఈమధ్యనే ముంబైలో బాంద్రా-వోర్లా సీలింక్ వంతెన ప్రారంభం కావడంతో ఆ బ్యాక్ డ్రాప్ లోనే క్విక్ గన్ మురుగన్ ను గుర్రంపై విన్యాసాలు చేయించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఇందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్ డిసి) నిరాకరించడంతో యూనిట్ ఖంగుతింది.
సీలింక్ వంతెనపై షూటింగ్ కు అనుమతి కోరుతూ 'మురుగున్' యూనిట్ ఈ మధ్యనే దరఖాస్తు చేసుకుంది. అయితే అధికారులు మాత్రం ఇంకా ఇక్కడ షూటింగ్ లకు అనుమతించడం లేదంటూ మొండిచేయి చూపింది. బాంద్రా కుర్రాళ్లయిన సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం సైతం ఈ ఫోర్ లైన్ సీలింక్ పై తమ సూపర్ బైక్స్ లో తిరిగేందుకు చేసుకున్న అభ్యర్థనను కూడా అంతకుముందే అధికారులు తోసిపుచ్చారు. ఉత్తరాది నటుల పనే ఇలాగుండే గుర్రం స్వారీ చేస్తానంటున్నట్టు దక్షిణాది నటుడిని నిరాకరించడంలో ఆశ్చర్యం కనిపించదు. అయితే తనను వెయిటింగ్ లో ఉంచడం పట్ల మన క్విక్ గన్ మురుగన్ అలియాస్ రాజేంద్రప్రసాద్ చిన్నబుచ్చుకున్నారు. 'పర్మిషన్ కోసం వెయిటింగ్ చేయాల్సి వస్తే దక్షిణాదిలో లెక్కకు మించిన సినిమాలు చేసి ఉండే వాడిని కాదు. బాలీవుడ్ చిత్రాల కోసం న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్స్, కౌలాలంపూర్ లోని పెట్రోనాస్ టవర్స్ ను అనుమతిస్తున్నప్పుడు ముంబై సీలింక్ పై గుర్రపు స్వారీకి అనుమతించకపోవడం ఏమిటి' అని ఆయన నిలదీస్తున్నారు. యమస్పీడ్ తో డ్రైవ్ చేసే మోటరిస్టులు, చివరకు పొల్టీషియన్లకు కూడా ఏదో విధంగా నచ్చచెప్పగలిగే అధికారులు మాత్రం ప్రస్తుతం గుర్రపు స్వారీ చేస్తానంటున్న క్విక్ గన్ మురుగున్ కు నచ్చజెప్పడం ఎలాగో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారట.
Be first to comment on this News / Article!
|