'హాలీడేస్' పాటలొచ్చాయి
శివనాగ్, భార్గవి, సానియా నాయకానాయికలుగా ఆర్.సి.ఎం. పతాకంపై ఎ.రామిరెడ్డి నిర్మించిన చిత్రం 'హాలీడేస్'. ఎన్.కార్తికేయరెడ్డి, జి.ఇషాంత్ రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. పాటల సీడీని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు అందజేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
తొలుత ఇటీవల కన్నుమూసిన ఈ చిత్ర కథానాయిక భార్గవి స్మృత్యర్థం ఒక నిమిషం పాటు అంతా మౌనం పాటించారు. అనంతరం పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, పరిశ్రమలో ఎంతోకాలంగా హెయిర్ డ్రస్సర్ గా పనిచేస్తున్న ఉష కుమారుడు శివనాగ్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడనీ, శివనాగ్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసుననీ చెప్పారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చాననీ, హీరోయిన్ భార్గవి నేడు మన మధ్య లేకపోవడం విచాకరమనీ పేర్కొన్నారు. 'హాలీడేస్' చిత్రం మ్యూజికల్ హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సంగీత దర్శకులు శ్రీధర్ శ్రీకాంత్ లు మాట్లాడుతూ, ఇది తమకు సంగీత దర్శకులుగా నాలుగవ సినిమా అనీ, ఈ చిత్రంతో మంచి బౌండరీ కొడతామనే నమ్మకంతో ఉన్నామనీ చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ఈ చిత్ర కథానాయకుడు ఉష కుమారుడనీ, ఉష ఎంతో కష్టపడి పైకొచ్చిందనీ, తాను కూడా అలా కష్టపడి పైకి వచ్చిన వాడినేననీ అన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి తాను వచ్చాననీ, ఆడియో, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. కథానాయకుడు శివనాగ్ మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతుండటం, తనకు ఇష్టమైన పూరీ జగన్నాథ్ చేతులమీదుగా ఆడియో విడుదల కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అయితే తనతో పాటు కలిసి నటించిన భార్గవి మరణించడం బాధాకరమని అన్నారు. దర్శకుడు కుమార్ మాట్లాడుతూ, శివనాగ్ తన మేనల్లుడేననీ, మంచి నటనను ప్రదర్శించాడనీ, అలాగే భార్గవికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రం మరో 'అభినందన' అవుతుందనే నమ్మకం ఉందన్నారు. బెల్లంకొండ సురేష్, సురేష్ కొండేటి తదితరులు ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
Be first to comment on this News / Article!
|