శోభన్ బాబు జీవిత చరిత్ర
నడవలేని వయసులో కూడా చాలామంది ముఖానికి రంగువేసుకుంటున్నారనీ, అది తప్పనను కానీ ఒక పరిధిని ఏర్పరచుకుని ఒక నటించను అని రిటైర్ మెంట్ ప్రకటించిన ఏకైక హీరో శోభన్ బాబు అనీ దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు. ఆకెళ్ల రాఘువేంద్ర రచించిన 'శోభన్ బాబు జీవిత చరిత్ర' (పరుగు ఆపడం ఒక కళ) పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదివారంనాడు జరిగింది. దాసరి, జయసుద, రాశీ మూవీస్ నరసింహారావు, రచయిత జె.కె.భారవి, నిర్మాత కెవివి సత్యనారాయణ, మైలవరం ఎమ్మెల్యే రమేష్ బాబు, ఆకెళ్ల రాఘువేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాసరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని శ్రీమతి జయసుధకు అందజేశారు.
దాసరి మాట్లాడుతూ, శోభన్ బాబు, తానూ చాలా మంచి మిత్రులమనీ, తామెప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోలేదనీ, బావ..బావ అనుకునే వాళ్లమనీ, తన భార్యకు కూడా చెప్పని రహస్యాలు ఆయనతో పంచుకునే వాడిననీ, అంతటి అనుబంధం తమదనీ గుర్తుచేసుకున్నారు. రచయిత ఈ పుస్తకానికి క్యాప్షన్ గా 'పరుగు ఆపడం ఒక కళ' అని రాశారనీ, అది శోభన్ బాబుకే చెల్లిందనీ ప్రశంసించారు. మనిషి అనే వాడు ఎలా బ్రతకాలి అనడానికి సరైన నిర్వచనం శోభన్ బాబు అనీ, ఆయన నిజమైన ఆర్థికవేత్తనీ అన్నారు. సంపాదించినది ఎలా ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో మురళీమోహన్, చంద్రమోహన్ వంటి వారికి అమూల్యమైన సలహాలను ఇచ్చిన మేథావి శోభన్ బాబు అని అన్నారు. శోభన్ బాబుతో పాటు తెలుగు పరిశ్రమ అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన మహనీయులందరి జీవిత చరిత్రలూ పుస్తకరూపంలో రావాలనీ, అలాంటి సత్కార్యానికి ఎవరు పూనుకున్నా ఆర్థిక సహాయం అందించడానికి తాను సిద్ధమేననీ ప్రకటించారు. శోభన్ బాబుది మహోన్నత వ్యక్తిత్వమనీ, ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన కథానాయిక తానే కావడం గర్వంగా ఉందనీ జయసుధ అన్నారు. ప్రతి హీరోయిన్ ను ఎంతో మర్యాదగా చూసేవారనీ, ఇటీవల తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శోభన్ బాబు గుర్తుకు వచ్చారనీ చెప్పారు. ఎనిమిది సంవత్సరాలు తెరకు దూరంగా ఉన్న ఓ నటుడు చనిపోతే రాష్ట్ర ప్రజల్లో ఇంత స్పందన ఎందుకు వచ్చింది? ఆయన సాధించిందేమిటి? అనే ప్రశ్నలు తనను వెంటాడాయనీ, అలాంటి తరుణంలోనే ఆయన జీవిత చరిత్ర రాయాలనే ఆలోచన కలిగిందనీ ఆకెళ్ల రాఘువేంద్ర తెలిపారు. శోభన్ బాబు పుస్తకాన్ని రచించే అవకాశం తనకు కలగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Be first to comment on this News / Article!
|