కెనడాలో 'మరోచరిత్ర'
ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ క్లాసిక్ ఫిల్మ్ 'మరోచరిత్ర' ఇప్పుడు అదే పేరుతో తెలుగులో రీమేక్ కు సిద్ధమవుతోంది. 'హ్యాపీడేస్', 'కొత్తబంగారులోకం', 'ఎవరైనా...ఎపుడైనా' చిత్రాల హీరో వరుణ్ సందేష్ ఈ చిత్రంలో కథానాయకుడు. అనిత అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తన కొత్త బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి యాదవ్ (హిందీ 'రేస్' ఫేమ్) ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గత ఫ్రిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. అయితే దర్శకులు ముందుగా చెప్పినట్టు ఈ చిత్రం అమెరికా లో కాకుండా కెనడా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది.
అమెరికాలో షూటింగ్ కు అవసరమైన అనుమతుల కోసం దిల్ రాజు గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ యూనిట్ మొత్తానికి వీసాలు సంపాదించడం సాధ్యం కాలేదని తెలుస్తోంది. దీంతో కెనడాలో షూటింగ్ జరపాలని దర్శకనిర్మాతలు ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టులో యూనిట్ మొత్తం కెనడా బయలుదేరి వెళ్తుంది. కె.బాలచందర్ 'మరోచరిత్ర' చిత్ర కథను నేటి ట్రెండ్ కు అనుగుణంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో దర్శకుడు రవి యాదవ్ తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. తమిళ వెర్షన్ ను జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ నిర్మిస్తోంది. మిక్కీ జె.మేయర్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే నాలుగు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో యామి గౌతమ్, ప్రతాప్ పోతన్, కోట శ్రీనివాసరావు, నరేష్, తలైవాసల్ విజయ్, సంధ్యా జనక్, ఆదర్శ్, ఊర్వశి తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి రవి యాదవ్ సినిమాటోగ్రఫీ సైతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|