'గోపి గోపిక..' ప్లాటినం డిస్క్
క్రియేటివ్ దర్శకుడు వంశీ తెరకెక్కించిన 'గోపి గోపిక గోదావరి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు, కమలిని ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పణలో మహర్షి సినిమాపతాకంపై వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోకి ప్లాటినం డిస్క్ లభించింది. హైద్రబాదాలోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో మంగళవారంనాడు ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక నిర్వహించారు.
వల్లూరి పల్లి రమేష్ మాట్లాడుతూ, ఈనెల 10న 'గోపి గోపిక గోదావరి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు చెప్పారు. జూన్ లో విడుదలైన ఆడియోకి విశేష స్పందన లభిస్తోందనీ, అందుకు నిదర్శనంగానే ఈరోజు ప్లాటినం డిస్క్ వేడుక జరుగుతోందనీ అన్నారు. సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ, ఆడియో మంచి హిట్టయిందనీ, అభిమానులు హాయ్ చక్రి అని కాకుండా ఈ చిత్రంలోని
'నువ్వు అక్కడుంటే నేనిక్కడుంటే' అనే పాటతోనే తనను పలకరిస్తున్నారని చెప్పారు. పాటలన్నింటినీ రామజోగయ్య శాస్త్రి రాశారనీ, వంశీ కలయికలో తనకు ఇది నాలుగో సినిమా కాగా, ఇందులో వంశీ పాటలు పాడటం విశేషమని చెప్పారు. గోదావరి సొగసులను ఈ చిత్రంలో వంశీ అద్భుతంగా తెరకెక్కించారనీ, వేణు-కమిలిని నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనీ పేర్కొన్నారు. రంగస్థల నటుడైన తన తండ్రికి ఈ చిత్రంలో వంశీ ఓ మంచి పాత్ర కూడా ఇచ్చారని చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు మంచి పేరు వస్తుందని నటుడు కృష్ణభగవాన్ పేర్కొన్నారు. వంశీ తనకు గాడ్ ఫాధర్ అని నటుడు కొండవలస, వంశీ స్టైల్ గొప్పదని మరో నటుడు జీవా పేర్కొన్నారు. సంగీతంతో ముడిపడిన చక్కటి కథాచిత్రమిదని కమలిని ముఖర్జీ తెలిపారు. ఈ చిత్రంతో తనకు ఆల్ రౌండర్ రచయితగా పేరు వచ్చినట్టు రామ జోగయ్య శాస్త్రి పేర్కొన్నారు. అందరికీ తన ధన్యవాదాలను వంశీ ముక్తసరిగా చెప్పారు. ఆనంది ఆర్ట్స్ అధినేత కిరణ్, గాయనీగాయకులు వేణు, వాసు, మధుమిత తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చివరగా ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది.
Be first to comment on this News / Article!
|