మధురిమ మనసు పడింది
ఇవాల్టి కొత్త తరం హీరోయిన్లలో మధురిమ తేలిగ్గానే పబ్లిసిటీ సంపాదించుకుంది. 'ఆ ఒక్కడు' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అందులో హీరోతో చేసిన బీచ్ సాంగ్ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టంది. తొలి సినిమా ఫలితం నిరాశపరిచినా ఆ సినిమాలో మధురిమదే కీలక పాత్ర కావడం, ఆ పాత్రను ఆమె సునాయాసంగా పోషించడం పలువురు నిర్మాతల దృష్టిని ఆకట్టుకుంది. నిజానికి తొలి చిత్రం నిర్మాణంలో ఉండగానే ఆమెకు పలు ఆఫర్లు వెల్లువెత్తాయి. వాటిల్లో 'మౌనరాగం' చిత్రం ప్రస్తుతం సెట్స్ పైకి వచ్చింది. తనీష్ ('రైడ్' ఫేమ్)కు జోడిగా మధురిమ ఇందులో నటిస్తోంది. పనిలో పనిగా పలు షోరూం ప్రారంభోత్సవాలలో రిబ్బన్ కటింగులతో కూడా మధురిమ బిజీగా ఉంది.
తాజాగా హైద్రాబాద్ లో టెసొరి ఇంటీరియర్ లైఫ్ స్టైల్ కలక్షన్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మధురిమ తనకు తెలుగు పరిశ్రమ ఎంతగానో నచ్చిందనీ, బాలీవుడ్ తో పోలిస్తే ఇక్కడ షూటింగ్ లన్నీ పక్కా ప్లానింగ్ తో జరుగుతుంటాయనీ కితాబిచ్చింది. బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా ప్రస్తుతం తన దృష్టంతా తెలుగు పరిశ్రమపైనే ఉందనీ, తనకు నచ్చిన హీరో అల్లు అర్జున్ అనీ, అతని నటనంటే తనకు చాలా ఇష్టమనీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాననీ, నటన కొనసాగిస్తూనే లా ప్రాక్టీస్ కూడా చేస్తాననీ చెప్పింది. సినిమాల ఎంపికలో తాను తొందర పడటం లేదనీ, అన్ని భాషల్లోనూ నటించాలన్నదే తన కోరిక అనీ తెలిపింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ బ్యానర్ లో ఓ ద్విభాషాచిత్రానికి కూడా ఆఫర్ వచ్చిందనీ, ఈ ఆఫర్ చాలా థ్రిల్లింగ్ కలిగించిందనీ చెప్పింది. మొత్తానికి మధురమి కెరీర్ స్పీడ్ అందుకున్నట్టే కనిపిస్తోంది.
Be first to comment on this News / Article!
|