యువ హీరోల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏడాదికి ఒక సినిమాకే పరిమితమవుతూ వస్తున్న పలువురు హీరోలు ఇప్పుడు ఏకకాలంలో పలు ప్రాజెక్ట్ లకు అంగీకరిస్తూ తమ అభిమానులను అలరించబోతున్నారు. స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తూ మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'ఆర్య-2' (టైటిల్ ఖరారు కావాల్సి ఉంది) చిత్రం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటూ ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న పేరుపెట్టని చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. క్రిష్ ('గమ్యం' ఫేమ్ ) దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం 'వేదం'లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. వీటికి తోడు 'హ్యాపీ' చిత్రం తర్వాత మళ్లీ తమ హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ చిత్రంలో నటించేందుకు కూడా అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు.
అల్లు అర్జున్ మూడవ చిత్రమైన 'బన్నీ' చిత్రానికి వి.వి.వినాయక్ గతంలో దర్శకత్వం వహించారు. ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు. వి.వి.వినాయక్ ప్రస్తుతం ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ రామ్ చరణ్ తో 'మగధీర' నిర్మిస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ - వినాయక్ కాంబినేషన్ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీనికి 'బద్రీనాథ్' అనే వర్కింగ్ టైటిల్ ను అనుకుంటున్నట్టు కూడా సమాచారం. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది.