'మారో' అంటున్న నితిన్
కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ లు చవిచూసి ఆ తర్వాత ఫ్లాపుల్లో జారిపోయిన హీరో నితిన్ కొద్దికాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇలియానాతో కలిసి నటిస్తున్న 'రెచ్చిపో', రామ్ గోపాల్ వర్మ 'అడవి' చిత్రాలపైనే ఆయన గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు నితిన్ అభిమానులకు మరో శుభవార్త కూడా రెడీ అయింది. సుమారు రెండున్నరేళ్లుగా వెలుగు చూడకుండా ల్యాబ్స్ లోనే మగ్గిపోతున్న 'సత్యం శివం సుందరం' చిత్రం విడుదలకు కూడా లైన్ క్లియర్ అయినట్టు తాజా సమాచారం. అయితే ఈ చిత్రం 'మారో' అనే కొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి 'సైలెంట్..బట్ వయెలెంట్' అనే ట్యాగ్ లైన్ కూడా ఉండబోతోంది.
నితిన్, మీరాచోప్రా ('బంగారం' ఫేమ్) జంటగా శ్రీనివాస రాజు 'సత్యం శివం సుందరం' చిత్రాన్ని ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖ్ డైరెక్షన్ లో రూపొందించారు. ఈ చిత్రం 'సాధు మిరిండ' పేరుతో తమిళనాట విడుదలై విజయంవంతమైంది కూడా. అయితే తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. 2006 డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల తేదీని, థియేటర్లనూ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది. చిత్ర కథానాయిక మీరాచోప్రా తనకు నిర్మాత కొంత పారితోషికం బకాయి పడ్డాడంటూ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించడంతో సినిమా రిలీజ్ నిలిచిపోయింది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రాజీ యత్నాలు కూడా ఫలించలేదు. దీంతో రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా విడుదల కాని గడ్డుపరిస్థితిని నితిన్ ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత క్రమంలో నితిన్ మళ్లీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యారు. అయినప్పటికీ 'సత్యం శివం సుందరం' తన కెరీర్ కు మంచి బ్రేక్ అయ్యేదనే అభిప్రాయం నితిన్ కు ఇప్పటికీ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆ చిత్రానికి అన్ని అవరోధాలు తొలగిపోవడంతో నిర్మాత సైతం సినిమా రిలీజ్ కు సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|