'అనగనగా ఒక అరణ్యం'సాంగ్స్
'బ్లూ' చిత్రంతో నంది అవార్డు అందుకున్న నిర్మాత టి.సుల్తాన్ తాజాగా హ్యాపీ మూవీస్ క్రియేషన్స్ పతాకంపై శేఖర్ చంద్ర దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'అనగనగా ఒక అరణ్యం'. కౌశల్, సైరాభాను, ఏక్తాత్రివేది, రేఖాశ్రీ హీరోహీరోయిన్లు. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ఫిలించాంబర్ లో బుధవారం సాయంత్రం జరిగింది. ఆడియో సీడీని జీవితా రాజశేఖర్ ఆవిష్కరించి తొలి ప్రతిని సీనియర్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు. ఆడియో క్యాసెట్ ను పి.సి.రెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావుకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
పి.సి.రెడ్డి మాట్లాడుతూ, ఈ దర్శకనిర్మాతలు ఇద్దరూ తన శిష్యులేననీ, ప్రపంచమంతా ఆర్థికమాంద్య పరిస్థితులున్న నేపథ్యంలో సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయడం సంతోషించదగిన విషయమనీ, ఆడియోతో పాటు ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. దర్శకనిర్మాతలకు ఈ చిత్రం మంచి విజయం అందించాలని జీవిత అభిలషించారు. పరిశ్రమతో తనకున్న సుదీర్ఘ అనుభవంతో స్వయంగా కథ రాసి సంగీత దర్శకత్వం వహించినట్టు నిర్మాత టి.సుల్తాన్ తెలిపారు. పరిశోధన కోసం అడవికి వెళ్లిన ఓ బృందం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందనేది దర్శకుడు చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారని చెప్పారు. నిర్మాతకు ఉన్న అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో కసిగా తీసిన చిత్రమిదని దర్శకుడు శేఖర్ చంద్ర పేర్కొన్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం రూపొందుతోందని హీరో కౌశల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ, కథానాయిక రేఖాశ్రీ, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|