' రెచ్చిపో 'తున్న జంట
సిక్స్ ప్యాక్స్, ఎయిట్ ప్యాక్స్ అంటూ ఫిజిక్ ప్రదర్శనతో ఆకట్టుకునేందుకు యువహీరో నితిన్ చేస్తున్న ప్రయత్నాలు ఇటీవల కాలంలో అంతగా కలిసిరాకపోయినా నితిన్ కు అవకాశాల జోరు మాత్రం తగ్గలేదు. నితిన్ స్టైల్ కు ముచ్చటపడిన రామ్ గోపాల్ వర్మ 'అడవి' చిత్రంతో బాలీవుడ్ కు నితిన్ ను పరిచయం చేస్తుండగా, ఇప్పుడు నితిన్ కు లేడీ లక్ కూడా కలిసొచ్చే తరుణం వచ్చింది. 'కిక్' చిత్రంతో టాలీవుడ్ లో తనకు తిరుగులేదనిపించుకుంటున్న ఇలియానా తొలిసారిగా నితిన్ తో జోడి కట్టిన 'రెచ్చిపో' చిత్రం సైతం మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ స్పెక్ట్రా మీడియో బ్యానర్ పై జి.వెంకటరమణ 'రెచ్చిపో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు పాటల మినహా టాకీ పూర్తి చేసుకున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామనీ, నితిన్ కెరీర్ లో ఇది బెస్ట్ ఫిలిమ్ గా ఉంటుందనీ పరుచూరి మురళి తెలిపారు. డిఫరెండ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్లు హైలైట్ గా నిలుస్తాయనీ, నితిన్-ఇలియానా మధ్య నడిచే కెమెస్ట్రీ ప్రేక్షకులను ఎంతో అలరిస్తుందనీ చెప్పారు. సినిమా ద్వితీయార్థం ఎక్కువ భాగం గల్ఫ్ ఎడారుల్లో చిత్రీకరించామనీ, సూడాన్, పాకిస్తాన్, అర్మేనియాకు చెందిన పలువురు టెక్నీషియన్లు పనిచేశారనీ రచయిత గోపి చెప్పారు. ఈ చిత్రంలో ఇలియానాతో తన కాంబినేషన్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందనీ, ముఖ్యంగా రఘుబాబు క్యారెక్టర్ కు నంది అవార్డు రావడం ఖాయమనీ నితిన్ తెలిపారు. ప్రేక్షకుల అంచనాలను మించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనీ, సెప్టెంబర్ మొదటివారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ నిర్మాత జి.వి.రమణ తెలిపారు. ఈ చిత్రానికి రమేష్ గోపి మాటలు, సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|