హీరో తనయుడితో జెడి ఫీట్!
'హోమం', 'సిద్ధం' చిత్రాల తర్వాత జె.డి.చక్రవర్తి మరోసారి మెగాఫోన్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ 'శివ' చిత్రంలో జెడి పాత్రతో పాపులరైన జెడి చక్రవర్తి ఆ తర్వాత హీరోగా కూడా 'గులాబీ', 'బొంబాయి ప్రియుడు' వంటి పలు చిత్రాల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మ తీసిన పలు చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన జెడి ఇప్పుడు అడపాదడపా నటిస్తూనే డైరెక్షన్ పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య 'జోష్' లో విలన్ పాత్రలో జె.డి.నటిస్తున్నారు. ఇదే తరుణంలో దర్శకుడిగా మరో చిత్రానికి పనిచేసేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నారు. జె.డి. రెడీ చేసుకున్న ఓ స్క్రిప్టు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థకు నచ్చిందనీ, ఆ బ్యానర్ లోనే ఈ చిత్రం ఉంటుందనీ తెలుస్తోంది.
'హంగామా', 'గుండమ్మగారి మనువడు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ ఇటీవల ఈ బ్యానర్ పై 'కిక్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. ఆ చిత్రం తర్వాత జె.డి. దర్శకత్వంలో సంస్థ కొత్త చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా హీరో సాయికుమార్ తనయుడు కథానాయకుడుగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అధికారికంగా మాత్రం ఈ విషయం ఇంకా ధ్రువీకరణ కావలసి ఉంది.
Be first to comment on this News / Article!
|