యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగచైతన్య వెండితెరపై ఎలా కనిపించబోతున్నారనే ఉత్సుకత రోజురోజుకూ ప్రేక్షకులలో ఎక్కువవుతోంది. నాగార్జున పోలికలతో యువ మన్మథుడుగా 'జోష్'తో అలరించేందుకు నాగచైతన్య ముస్తాబవుతున్నారు. ఇటీవలే గోల్డెన్ టెంపుల్ సిటీలో నెలరోజుల కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుని చిత్రయూనిట్ హైద్రాబాద్ చేరుకుంది. యువతరం మనోభావాలను తన చిత్రాల సక్సెస్ గా మలుచుకుంటున్న దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. వాసువర్మ తొలిసారిగా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 18న ఈ చిత్రం ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కాలేజీ నేపథ్యంలో యాక్షన్ తో కూడిన ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, దిల్ రాజు చిత్రాలలో హైలైట్ గా నిలిచే ఫ్యామిలీ ఎమోషన్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నాయనీ తెలుస్తోంది. దీనికితోడు నాగచైతన్యకు జోడిగా సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా తొలిసారి తెలుగు తెరకు పరిచయం చేస్తుండటం కూడా సినిమాపై మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గెస్ట్ రోల్స్ లో నాగార్జున-రాధ కూడా కనిపించబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ చిత్రానికి సందీప్ చౌతా అందిస్తున్న సంగీతం మ్యూజికల్ హిట్ ఖాయమనే అంచాలు కూడా ఉన్నాయి. వచ్చే వారంలోనే ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో నాగచైతన్య వర్కింగ్ స్టిల్స్ ను దిల్ రాజు తొలిసారిగా శనివారంనాడు మీడియాకు రిలీజ్ చేశారు. ఆగస్టు 12న 'జోష్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.