ఆగస్టులో వస్తున్న 'జోష్'
అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ తాము నిర్మిస్తున్న చిత్రానికి 'జోష్' టైటిల్ ను ఖరారు చేసినట్టు దిల్ రాజు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారిగా చిత్ర విశేషాలను దిల్ రాజు శనివారంనాడు సంస్థ కార్యాలయంలో తెలియజేశారు.
ఈ చిత్రం ప్రారంభం నుంచి అందరూ 'జోష్' అనే టైటిల్ ను అనుకుంటున్నారనీ, కథకు అనుగుణంగా కూడా టైటిల్ ఉండటంతో దానినే ఖరారు చేశామనీ దిల్ రాజు తెలిపారు. తమ సంస్థపై ఉన్న నమ్మకంతో నాగార్జున తన తనయుడిని పరిచయం చేసే అవకాశాన్ని తమకు ఇచ్చారనీ, అందుకు తగ్గట్టే సినిమా అద్భుతంగా తెరకెక్కుతోందనీ చెప్పారు. తమ బ్యానర్ లో వస్తున్న 9వ చిత్రమిదనీ, ఈ చిత్రంతో తమకు ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయమనీ ధీమా వ్యక్తం చేశారు. తమ సంస్థకు మంచిపేరు తెచ్చిన 'ఆర్య', 'దిల్', 'బొమ్మరిల్లు' చిత్రాలకు వాసువర్మ పనిచేశారనీ, అతనిలో మంచి ప్రతిభ ఉందనీ చెప్పారు. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందనీ, ఒక పాటను స్విట్జర్లాండ్ లో, మరో పాటను హైద్రాబాద్ లో ప్లాన్ చేస్తున్నామనీ తెలిపారు. నాగచైతన్య సరస హీరోయిన్ రాధ కుమార్తె కార్తికను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. సందీప్ చౌతా సంగీత అందించిన ఈ చిత్రం ఆడియోను ఈనెల 18న రిలీజ్ చేసి, ఆగస్టులో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జె.డి.చక్రవర్తి, సునీల్, సితార, ఆనంద్, సూర్య, హేమ తదితరులు నటిస్తున్నారు. చంద్రబోస్-సిరివెన్నెల సాహిత్యం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|