'మాయానగర్' టాలెంట్ హంట్
సినీరంగంలోకి ప్రవేశించాలనుకునే వారి కోసం మాయానగర్ టాలెంట్ హంట్ కు నటి భూమిక, భరత్ ఠాకూర్ దంపతులు శ్రీకారం చుట్టారు. ఈ ఇరువురి సారథ్యంలో నడుస్తున్న మాయానగర్ డాట్ కామ్ లో ఈ టాలెంట్ హంట్ నిర్వహించనున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ టాలెంట్ హంట్ ను హైద్రారాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు.
దాసరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినీరంగంలోకి సులువుగా ప్రవేశించేందుకు టాలెంట్ హంట్ లు ఉపకరిస్తాయనీ, మాయానగర్ టాలెంట్ హంట్ కూడా పరిశ్రమలో అడుగుపెట్టాలనుకునే వారికి గేట్ వే అవుతుందని ఆశిస్తున్నాననీ అన్నారు. అందం-అభినయం పుష్కలంగా ఉన్న నటి భూమిక అనీ, ఆమె భర్త భరత్ ఠాకూర్ బిజినెస్ మాగ్నెట్ అయినప్పటికీ చిత్ర పరిశ్రమపై మక్కువ ఉన్నట్టు కనిపిస్తోందనీ, వారు చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు టీవీ రంగానికి కూడా నూతన కళాకారుల ఆవశ్యకత ఉందన్నారు. తాను 40 ఏళ్లుగా 200 మందికి పైగా నటీనటులను పరిశ్రమకు పరిచయం చేశాననీ, అప్పట్లో కొత్తవాళ్లతోనే 'స్వర్గం నరకం' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాననీ గుర్తు చేశారు. త్వరలోనే ఒక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నెలకొల్పాలని కూడా నిర్ణయించాననీ, అలాగే తమ సంస్థ నిర్మించబోయే 5 చిత్రాల్లో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తామనీ అన్నారు. ఇందుకు గాను మాయానగర్ టాలెంట్ హంట్ సాయాన్ని కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. 'మాయానగర్' సంస్థ అధినేత భరత్ ఠాగూర్ మాట్లాడుతూ, తాము ఇప్పటికే డౌన్ టౌన్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 'యాగం', 'తకిట తకిట' అనే చిత్రాలను తీస్తున్నట్టు చెప్పారు. తాము చేపట్టే టాలెంట్ హంట్ వల్ల కేవలం నటనే కాకుండా దర్శకత్వం, సంగీతం, ఛాయాగ్రహణం వంటి వివిధ శాఖలలో నూతన కళాకారుల ప్రవేశానికి ఎంతో తోడ్పడుతుందన్నారు. భూమిక, జీవిన్ ఆద్య, వినోద్ ఖిన్ని, మాయానగర్ ఎడిటర్ ప్రభు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|