తారకరత్న విలనీ?!
నందమూరి హీరోల్లో ఏకకాలంగా తొమ్మిది చిత్రాల ముహూర్తాలతో చరిత్ర సృష్టించిన క్రెడిట్ తారకరత్నకే దక్కుతుంది. అయితే వీటిలో ఇప్పటికీ కొన్ని చిత్రాలు సెట్స్ పైకి రాలేదు. వరుస ఫెయిల్యూర్స్ ట్రాక్ ఇందుకు కారణం. 'ఒకటో నెంబర్ కుర్రాడు', 'భద్రాద్రి రాముడు' వంటి చిత్రాలు ఆయనకు సరైన హిట్ ఇవ్వలేకపోయాయి. ఇటీవలే 'వెంకటాద్రి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చినా జనాలు సరిగా రిసీవ్ చేసుకోలేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న ఏకైక చిత్రం 'ముక్కంటి' పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలీదు. ఇంతవరకూ సక్సెస్ టేస్ట్ ఏమిటో తెలియని తారకరత్న ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నారు. అయితే ఈసారి హీరోగా కాకుండా విలన్ గా కనిపించబోతున్నారు. టెక్నికల్ విజార్డ్ గా అనిపించుకుంటున్న దర్శకుడు అల్లరి రవిబాబు తన తదుపరి చిత్రంలో తారకరత్నను విలనీ పాత్రలో చూపించబోతుండటం విశేషం.
హిలేరియస్ కామెడీ చిత్రంగా 'అల్లరి' , సస్పెన్స్ థ్రిల్లర్ గా 'అనసూయ' చిత్రాలను తీసి ప్రేక్షకులను అలరించిన రవిబాబు ఇటీవలే టీనేజ్ రొమాంటిక్ మూవీగా 'నచ్చావులే' తో మరో హిట్ కొట్టారు. ఈ చిత్రం తర్వాత ఆయన 'అమరావతి' పేరుతో ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో టైటిల్ పాత్రను భూమిక, మరో కీలక పాత్రను స్నేహ పోషించబోతున్నట్టు సమాచారం. తారకరత్నను కూడా ఇప్పుడు ఈ బెటాలియన్ లో చేర్చారు. హీరోలుగా సక్సెస్ కాని పలువురు నటులు నెగిటివ్ పాత్రలతో అలరించి ఆ తర్వాత క్రమంలో హీరోగా రాణించిన సందర్భాలు పరిశ్రమలో చాలానే ఉన్నాయి. తారకరత్నకు సైతం ఇప్పుడు అలాంటి బ్రేక్ వస్తుందేమో చూడాలి. ఈనెల 26న 'అమరావతి' చిత్రం సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|