యాక్సిడెంట్ తర్వాత తొందరగానే కోలుకున్న ఎన్టీఆర్ ఆ గ్యాప్ ను భర్తీ చేస్తూ వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ తీరికలేనంత బిజీగా ఆయా చిత్రాల షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుర్స్' చిత్రం నాన్ స్టాప్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆగస్టు చివరికి ఈ చిత్రం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న చిత్రానికి కూడా ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి 'బృందావనం' అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీనికి 'గోవిందుడు అందరి వాడేలే' అనే ట్యాగ్ లైన్ కూడా ఉండబోతోంది.
దిల్ రాజు బ్యానర్ లోనే 'మున్నా' చిత్రం ద్వారా వంశీ పైడిపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో మరోసారి వంశీ పైడిపల్లికి దిల్ రాజు అవకాశం కల్పిస్తూ 'బృందావనం' చిత్రం బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్ ఇమేజ్ కు తగినట్టుగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతోందని, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయనీ తెలుస్తోంది. ఎన్టీఆర్ కు జోడిగా 'యమదొంగ' తర్వాత మరోసారి ప్రియమణి నటించనున్నట్టు సమాచారం. సెప్టెంబర్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ తో మెహర్ రమేష్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రం అక్టోబర్ లో ప్రారంభమవుతుంది.