'నీలవేణి' స్పీడ్ ప్రోగ్రస్
నటి ఆర్తి అగర్వాల్ మరో ఇన్నింగ్స్ లో భాగంగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'నీలవేణి'. చదువుకుంటూ ప్రేమించిన వాడితో జీవితంలో స్థిరపడాల్సిన ఓ అమ్మాయి ఆదిశక్తిగా ఎందుకు మారాల్సి వచ్చిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టైటిల్ పాత్రలో ఆర్తి, కథానాయకుడుగా బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ నటిస్తున్నారు. భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఎం.జి.ఆర్. కంబైన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకొంటోంది. సోమవారంనాడు లొకేషన్లోనే ఆ విశేషాలను చిత్ర యూనిట్ తెలియజేసింది.
మంచి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, ఇంతవరకూ 60 శాతం షూటింగ్ పూర్తి చేశామనీ భరత్ పారేపల్లి తెలిపారు. ఈ షెడ్యూల్ 25వ తేదీ వరకూ జరుగుతుందనీ, ఆగస్టు 12 నుంచి మరో షెడ్యూల్ ఉంటుందనీ చెప్పారు. అక్టోబర్ లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. కె.విశ్వనాథ్ చిత్రాల తరహాలో సందర్భానుసారంగానే ఈ చిత్రంలో పాటలు ఉంటాయనీ, లలిత్ సురేష్ సంగీత సారథ్యంలో పాటలన్నీ బాగా వచ్చాయనీ చెప్పారు. రఘువరన్, ప్రకాష్ రాజ్ లను కలిసి చూసినట్టుగా ఇందులోని ముకుల్ దేవ్ పాత్ర ఉంటుందన్నారు. చక్కటి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నటిస్తుండటం సంతోషంగా ఉందని ముకుల్ దేవ్ పేర్కొన్నారు. తానింతవరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఇందులో తన పాత్ర ఉంటుందనీ, మధ్యతరగతికి చెందిన సున్నిత మనస్కురాలైన అమ్మాయి పాత్ర తనదనీ ఆర్తి అగర్వాల్ తెలిపింది. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆదిత్య ఓం తెలిపారు. ఛాయాగ్రాహకుడు ఎ.ఆర్.రాంబాబు, నటి ద్రాక్షారామం సరోజిని కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, ఎం.ఎస్.నారాయణ, రవికాలే, కాటరాజు, రవిప్రకాష్, హర్షవర్దన్, శివపార్వతి, గీతాసింగ్, అంజలి, సత్యప్రియ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొమ్మనాపల్లి మాటలు, మేనగ శ్రీను ఎడిటింగ్ అందిస్తున్నారు.

Be first to comment on this News / Article!
|