రవితేజతో 'నాడోడిగల్'
స్ట్రయిట్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించి పలు డబ్బింగ్ చిత్రాలను కూడా అందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో సంచలనం రేకెత్తించబోతున్నారు. ఇటీవలే ఆయన నిర్మించిన 'రైడ్' చిత్రం సక్సెస్ అయింది. ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడుగా రమేష్ వర్మ దర్శకత్వంలో 'భీష్మ' చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా తమిళంలో విజయవంతమైన 'నాడోడిగల్' రీమేక్ రైట్స్ ను కూడా దక్కించుకుని అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నారు. చిన్నచిత్రంగా విడుదలై తమిళనాట 'నానోడిగల్' సంచలన విజయాన్ని దక్కించుకుంది. స్నేహం కథాంశంగా శశికుమార్, విజయ్, భరణి, అనన్, నేహ తదిరులులు ప్రధాన పాత్రధారులుగా సముతిరాకని దర్శకత్వంలో మైఖైల్ రాయప్పన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దక్షిణాదిలోనే కాకుండా మలేసియాలో 6, సింగపూర్ లో 2, శ్రీలంకలో ఒక థియేటర్ లో ఈ సినిమా రిలీజై మంచి ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ఈ నేపథ్యంలో రీమేక్ రైట్స్ కు గట్టిపోటీ ఎదురైనా బెల్లంకొండ మంచి ఆఫర్ ఇచ్చి ఆ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరలో రీమేక్ చేసేందుకు బెల్లంకొండ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా రవితేజ నటించనున్నారనీ, మరో కీలక పాత్రను అల్లరి నరేష్ కు ఆఫర్ చేశారనీ తెలుస్తోంది.
రవితేజ-కృష్ణవంశీ కాంబినేషన్ లో బెల్లంకొండ ఓ చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే 'నాడోడిగల్' రీమేక్ ముందుగా సెట్స్ పైకి వచ్చినట్లయితే రవితేజ-కృష్ణవంశీ చిత్రం ఒకింత వెనక్కి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కాగా, 'నాడోడిగల్' రీమేక్ కు తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సముతిరాకని తెలుగు వెర్షన్ కూడా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|