ఈవారంలో 4 రిలీజ్ లు
ఆగస్టు మాసం పెద్ద సినిమాలకు వేదిక కానుండటంతో పలు చిన్న చిత్రాలు ఈనెలలోనే విడుదలకు పోటీపడుతున్నాయి. ఈ వారంతంలో నాలుగు చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నటుడు చిన్నా దర్శకత్వంలో రూపొందిన 'ఆ ఇంట్లో', కావేరీ ఝా నటించిన 'ఊహా చిత్రం', కలర్స్ స్వాతి ప్రధాన భూమిక పోషించిన 'కలవరమాయె మదిలో', మీనా 'వెంగమాంబ' చిత్రాలు ఇదేవారంలో విడుదలవుతున్నాయి.
ఈనెల 16వ తేదీ గురువారంనాడు 'ఆ ఇంట్లో', 17న 'ఊహాచిత్రం', 'కలవరమాయె మదిలో', 'వెంగమాంబ' చిత్రాలు విడుదల కానున్నాయి. నటుడు చిన్నా కథానాయకుడుగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ 'నా ఇంట్లో'. యు9 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మిత్రులతో కలిసి ఈ చిత్రాన్ని చిన్నా నిర్మించారు. వంశీకృష్ణ, కావేరీ ఝా ('నగరం ఫేమ్') జంటగా లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ పెదవీర్రాజు సమర్పణలో కె.పైడిబాబు 'ఊహాచిత్రం' నిర్మించాను. రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాని దర్శకుడు సత్యకి తెరకెక్కించారు. గాయని కావాలనుకునే అమ్మాయి తన కలను ఎలా సాకారం చేసుకుందనే కథాంశంతో 'కలవరమాయె మదిలో' చిత్రం రూపొందింది. కలర్స్ స్వాతి, కమల్ కామరాజ్ ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె.సతీష్ దర్శకత్వంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ వడ్లపట్ల నిర్మించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తురాలు తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రతో రూపొందించిన భక్తిరస చిత్రం 'వెంగమాంబ'. గతంలో 'అన్నమయ్య' చిత్రాన్ని అందించిన దొరస్వామి రాజు వి.ఎం.సి.ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. టైటిల్ పాత్రలో మీనా, వేంకటేశ్వర స్వామిగా సాయికిరణ నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఈ నాలుగు చిత్రాలలో పెద్ద స్టార్ లేనప్పటికీ ఏమాత్రం వైవిధ్యం ఉన్నా ప్రేక్షకుల ఆదరణ చూరగొనే అవకాశాలు ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|