20 నుంచి 'జోష్' మార్కెట్లో
నాగార్జున తనయుడు నాగచైతన్య తొలిసారి హీరోగా పరిచయం అవుతున్న 'జోష్' చిత్రం వర్కింగ్ స్టిల్స్ ఇప్పటికే అక్కినేని అభిమానులను సంబరంలో ముంచెత్తుతున్నాయి. నాగార్జున నట వారసత్వాన్ని నిలపగలిగే సత్తా చైతన్యకు ఉందనీ, తొలి సినిమాతోనే యువతరం హార్ట్ త్రోబ్ కావడం ఖాయమనే బలమైన అంచనాలు కూడా నెలకొన్నాయి. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ సంచలన విజయాలు చవిచూస్తున్న దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. వాసువర్మ దర్శకుడు. సందీప్ చౌతా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోనూ ఈనెల 18న అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఫంక్షన్ లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయబోతున్నారు.
ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా ఈ విషయాన్ని తెలియజేస్తూ, నాగచైతన్య తొలి చిత్రం మ్యూజిక్ ను తమ సంస్థ ద్వారా విడుదల చేస్తుండటం ఎంతో గర్వంగా ఉందనీ, ఈనెల 20 నుంచి ఆడియో మార్కెట్లో లభిస్తుందనీ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అభిమానులు ఆడియో కోసం ఎదురు చూస్తున్నందున పెద్ద మొత్తంలో క్యాసెట్లు, సీడీలు సిద్ధం చేసే క్రమంలో రెండు రోజుల జాప్యం అనివార్యమవుతోందని తెలిపారు. అక్కినేని అభిమానులు ఈ స్పల్వ జాప్యాన్ని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంతో తమ బ్యానర్ కు ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయమని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా పరిచయమవుతోందనీ, ఆగస్టులో సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామనీ ఆయన చెప్పారు. ప్రకాష్ రాజ్, జె.డి.చక్రవర్తి, సునీల్, సితార తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చంద్రబోస్-సిరివెన్నెల సాహిత్యం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|