మనోజ్ కుమార్ 'బిందాస్'
మంచు మనోజ్ కుమార్, షీనా హీరోహీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. రచయిత వీరుపోట్లను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుంకర సుబ్రమణ్యం నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇంతవరకూ జరిగిన షెడ్యూల్ తో 30 శాతం షూటింగ్ పూర్తయినట్టు నిర్మాత తెలిపారు.
మనోజ్ కుమార్ తన నిజ జీవితంలో లాగా సరదగా, చలాకీగా ఉండే కుర్రాడిగా ఈ చిత్రంలో కనిపిస్తారనీ, వినోద ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందనీ ఆయన తెలిపారు. ఈ చిత్రానికి (ఎ) అజయ్ గాడి విజయగాథ, (బి) బిందాస్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు హీరో మనోజ్ తెలిపారు. ఈ రెండు టైటిల్స్ లో ప్రేక్షకులు దేనికి ఎక్కువ ఓటేస్తే ఆ టైటిల్ ఖరారు చేస్తామని అన్నారు. ఇందుకోసం ఎ కానీ బి కానీ టైప్ చేసి 56006767 నెంబర్ కు ఎస్.ఎం.ఎస్.చేయాల్సిందిగా ఆయన సూచించారు. విజేతలకు బహుమతులు కూడా అందజేస్తామన్నారు. యూత్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, మనోజ్ దర్శకుల హీరో అనీ వీరుపోట్ల తెలిపారు. మనోజ్ నిజ జీవితానికి దగ్గరగా ఆయన పాత్ర ఉంటుందని వివరించారు. పరిశ్రమలోని పలువురు ప్రముఖ తారాగణం ఇందులో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం వీరుపోట్ల అందిస్తుండగా, భవనచంద్ర పాటలు, రమేష్ బాబు సినిమాటోగ్రఫీ, బోబో శశి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|