'జోష్'కు మెగా మిస్సింగ్!
అగ్రహీరోల వారసులు పరిశ్రమలోకి అడుగుపెడుతున్న తరుణంలో జరిగే వేడుకలకు సహజంగా పరిశ్రమకు చెందిన హేమాహేమీలంతా పాల్గొని ఆశీస్సులు ఇవ్వడం సహజం. నాగార్జున తనయుడు నాగచైతన్య తొలిసారిగా 'జోష్' చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయవుతుండటంతో ఆ చిత్రం ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించారు. చైతన్యను ఆశీర్వదించేందుకు డాక్టర్ మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సినీ ప్రముఖులంతా విచ్చేసినప్పటికీ ఆడియో ఫంక్షను మెగా ఫ్యామిలీ దూరంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన చిరంజీవితో పాటు, ఆయన కుటుంబ హీరోలు కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ హాజరుకాకపోవడంపై ఆడియెన్స్ లో ప్రధాన చర్చనీయాంశమైంది. నాగార్జునకూ, చిరంజీవికి మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి నంది అవార్డును (ఉత్తమ నటులుగా) ఒకపరి షేర్ చేసుకున్న సందర్భం కూడా ఉంది. 'మా' టీవీలో భాగస్వామ్యమూ కొనసాగింది. ఇంతలోనే ఏం జరిగి ఉంటుంది? చిరు ఎందుకు దూరంగా ఉండిపోయారు?
నిజానికి చిరంజీవి తిరుపతి పర్యటనలో ఉండటం వల్ల 'జోష్ ' ఆడియో ఫంక్షన్ కు హాజరు కాలేకపోయారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆడియో ఈవెంట్ జరుగుతుండగా నాగచైతన్యకు తన అభినందలు తెలియజేస్తూ వీడియో రికార్డు సందేశాన్ని చిరంజీవి పంపారు. అయితే చిరు ఫ్యామిలీ సభ్యులు కానీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరూ ఈ ఫంక్షన్ కు హాజరు కాలేదు. ఇందుకు ప్రత్యేక కారణాలేమిటనేవి స్పష్టంగా తెలియరాలేదు. అయితే చిరు ఫ్యామిలీపై విరుచుకుపడేందుకు ఏ సందర్భాన్ని మోహన్ బాబు విడిచిపెట్టరనీ, మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ ఈవెంట్ కు దూరంగా ఉండటానికి అదో కారణం కావచ్చనీ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్మాత దిల్ రాజుకు సన్నిహితుడుగా పేరున్న ప్రభాస్ నగరంలో లేరు. బ్యాంకాక్ లో 'ఏక్ నిరంజన్' షూటింగ్ లో ఉన్నారు. రామ్, వరుణ్ సందేష్, నిఖిల్ వంటి కుర్రహీరోలు హాజరైనప్పటికీ...అల్లు అర్జున్, రామ్ చరణ్ ల రాకకోసం ఎదురుచూసిన పబ్లిక్ లో మాత్రం తొలుత ఉత్సుకత...ఆ తర్వాత నిరుత్సాహం తొంగిచూసింది.
Be first to comment on this News / Article!
|