'ఛాంబర్ ఎన్నికలు ఆపండి'
ఈనెల 26న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఎన్నికలపై నిజనిర్దారణ జరపాలనీ, అంతవరకూ ఎన్నికలు ఆపివేయాలనీ తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. హైద్రాబాద్ లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి కార్యదర్శి నట్టికుమార్, సమితి సభ్యుడు సంగిశెట్టి దశరథ తదితరులు మాట్లాడారు.
చాంబర్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీకి, ప్రొడ్యూసర్స్ సెక్టార్ కు సభ్యుడిగా తాను నామినేషన్ వేసినట్టు నట్టికుమార్ తెలిపారు.అయితే తాను ఎన్నికల నుంచి ఉపసంహరించుకున్నట్టు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఎన్నికలను ఏకగ్రీవం చేశారని ఆయన ఆరోపించారు. దీని వెనక ఏదో మోసం దాగుందనీ, ఎన్నికల అధికారికి ఈ విషయాన్ని ఫిర్యాదు చేశాననీ తెలిపారు. తాను ఇప్పటికీ పోటీలోనే ఉన్నాననీ, తనతో పాటు పలువురు అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు మద్దతు పలుకుతున్నారనీ చెప్పారు. చాంబర్ కు ఎన్నికైన పలువురు రాజీనామాకు కూడా సిద్ధపడుతున్నారనీ, ఎన్నికలకు సంబంధించి తనకు న్యాయం జరగని పక్షంలో కోర్టుకు వెళ్తాననీ అన్నారు. ఎపి ఫిలిం చాంబర్ లో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినందున వాటిని కప్పిపుచ్చేందుకే ఎన్నికలను ఏకపక్షం చేశారని ఆయన ఆరోపించారు. 2000 నుంచి ఫిలిం చాంబర్ అకౌంట్స్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చాంబర్ ఏ ఒక్కరి సొత్తూ కాదని సమితి సభ్యుడు సంగిశెట్టి దశరథ వ్యాఖ్యానించారు. నాయకులు ఎవరూ లేనట్టు ప్రతిసారి కొందరు నాయకులే కమిటీలో ఉంటారనీ, ఆ సంప్రదాయం మారాలని అన్నారు. ఎ.పి.ఫిలిం చాంబర్ కు సుదీర్ఘ చరిత్ర ఉందనీ, అయితే ఎన్నికల్లో ఇలాంటి మోసం ఎప్పుడూ జరగలేదనీ, న్యాయం జరిగేంతవరకూ తమ పోరాటం ఆగదని సమతికి చెందిన సంభ్యులు ప్రకాష్ రావు, సాయివెంకట్, ఎస్.వి.రావు తదితరులు స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
|