1500 థియేటర్లలో 'మగధీర'
ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాల్లో రామచరణ్ 'మగధీర' భారీ అంచనాలను రేకెత్తిస్తూ విడులకు సిద్ధమవుతోంది. హాలీవుడ్ చిత్రాలను తలపించే భారీ సెట్టింగ్ లు, రామ్ చరణ్ గెటప్స్ ఇప్పటికే వర్కింగ్ స్టిల్స్ రూపంలో అందర్నీ ఆకట్టుకుంటూ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అంచనాలను రోజురోజుకూ పెంచుతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ నిర్మాణ విలువలతో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 29న భారీ ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 1500కు పైగా థియేటర్లలో 14 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
తెలుగు సినిమా చరిత్రలోని ఇంతకు ముందు చూడని విజువల్ ఫీస్ట్ గా ఈ చిత్రం ఉంటుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. హీరోగా తన రెండవ చిత్రమే ఇంత భారీగా రూపొందడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించిందనీ ఆయన తెలిపారు. అత్యున్నత నిర్మాణ విలువలతో రాజమౌళి ఎక్స్ టార్డినరీ టేకింగ్ తో ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. కీరవాణి సంగీతం సినిమాకి ప్రాణమైతే, రీకార్డింగ్ ట్రాక్ ను సీడీలుగా కూడా రిలీజ్ చేయవచ్చనీ, అలాగే కెమెరామన్ సెంథిల్ అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారనీ చెప్పారు. టీమ్ వర్క్ తో సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. తెలుగు సినిమా స్టామినా ఈ చిత్రంతో దశదిశలా మారుమోగుతుందని రాజమౌళి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో ప్రేమకథా ఇతవృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. ప్రధాన జంటతో పాటు రియల్ స్టార్ శ్రీహరి సైతం ద్విపాత్రభినయం చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ, ఎం.రత్నం మాటలు, రమా రాజమౌళి స్టైలింగ్, రవీందర్ కళాదర్శకత్వం, పీటర్ హెయిన్స్-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|