నిశ్చల ప్రేమపోరాటం
ప్రేమలో పడటం సులభమే కానీ ప్రేమ పరీక్షలను ఓర్పు, ధైర్యంతో ఎదుర్కొన్నపుడే ప్రేమ విజేత కాగలుగుతారు. నిశ్చల అనే అమ్మాయి తన ప్రేమకు ఎదురైన అడ్డంకులను ఎదుర్కొన్ని చివరకు మనసు పడిన యువకుడిని దక్కించుకుంటుంది. ఇదే ఇతివృత్తంతో 'నిశ్చల' చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ రిషి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్.కరుణాకర్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ విశాఖపట్నానికి చెందిన విద్యావేత వి.శ్రీనివాసరావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్, అర్చనశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
తొలిసారి చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, వైజాగ్ లో రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించామనీ, విశాఖ, అరకు, భీమిలి, రుషికొండ లొకేషన్లతో రెండు పాటలతో పాటు 70 శాతం టాకీ పూర్తి చేశామని తెలిపారు. హైద్రాబాద్ లో ఓ పాట తీస్తామనీ, నెలాఖరుకు షూటింగ్ పార్ట్ పూర్తవుతుందనీ చెప్పారు. నిశ్చల అనే అమ్మాయి ప్రేమకథే ఈ చిత్రమని దర్శకుడు కరుణాకర్ తెలిపారు. షూటింగ్ పూర్తయిన మేరకు ఎడిటింగ్ కూడా పూర్తి చేశామన్నారు. 37 నిమిషాల గ్రాఫిక్ వర్క్ ఈ చిత్రానికి ఓ హైలైట్ అవుతుందనీ, ఆగస్టులో సినిమా రిలీజ్ ఉంటుందనీ చెప్పారు. తొలి చిత్రంతోనే మంచి పాత్రలు చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని హీరో శేఖర్, హీరోయిన్ అర్చనాశర్మ, హీరో సోదరిగా నటిస్తున్న తపస్విని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, సాయాజీ షిండే, సూర్య, ప్రగతి, సురేఖావాణి, వేణుగోపాల్, షాన్ తదితరులు నటిస్తున్నారు. నంద్యాల రవి మాటలు, టి.ఆర్.ప్రసాద్ సినిమాటోగ్రఫీ, మధు ఎడిటింగ్, సి.హెచ్.కరుణాకర్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|