బాలయ్య గెటప్ భళీ!
'మిత్రుడు' చిత్రంలో స్టయిలిష్ గా కనిపించిన బాలకృష్ణ ఈసారి రఫ్ లుక్ తో మాస్ లుక్స్ తో అలరించబోతున్నారు. గుబురు మీసాలతో చెంపల చుట్టూ వెరైటీ కటింగ్ చేసి గడ్డంతో బాలకృష్ణ రెండ్రోజుల క్రితం జరిగిన 'జోష్' వేడుకలో కనిపించి సెంటరాఫ్ ది అట్రాక్షన్ గా కూడా నిలిచారు. ఎంతో చలకీగా అందర్నీ పలకరిస్తూ నవ్వులు చిందిస్తూ అసాంతం కనిపించిన బాలకృష్ణకు ఈ గెటప్ బాగా నప్పిందనీ, ఆయన ముఖంలో ఆత్మవిశ్వాసంతో కూడిన మెరుపులు మెరుస్తున్నాయనీ అంతా అనుకున్నారు. ఈ గెటప్ బాలకృష్ణ నటించబోయే కొత్తచిత్రంలోదే కావచ్చనే ఊహాగానాలు కూడా బలంగా వినిపించాయి.
బాలకృష్ణకు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ తక్కువేం కాదు. 'సమర సింహారెడ్డి' 'నరసింహనాయుడు' తర్వాత ఆయన నుంచి సరైన హిట్లు రాకపోయినా బాలకృష్ణ కొత్త సినిమాలో నటిస్తున్నారంటే అభిమానులు మళ్లీ ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ సైతం వరుస ప్రాజెక్ట్ లకు కమిట్ అవుతూ బిజీ కాబోతున్నారు. వీటిలో బోయపాటి శ్రీను ('తులసి' ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రం, బెల్లంకొండ సురేష్ నిర్మాతగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో 'భీష్మ' చిత్రం ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాలో బాలకృష్ణ ఈ గెటప్ లో కనిపంచబోతున్నారనేది ఇంకా నిర్దారణ కాలేదు. అయితే బోయపాటి సినిమా కోసం ఈ గెటప్ ఉండవచ్చని మాత్రం వినిపిస్తోంది. ఎలాగూ బాలకృష్ణ ఇప్పుడిప్పుడే మళ్లీ పాలిటిక్స్ వైపు వెళ్లాల్సిన పని పెద్దగా లేదుకాబట్టి మరిన్ని మంచి చిత్రాలు, పాత్రలతో అలరిస్తారనే అనుకోవచ్చు.
Be first to comment on this News / Article!
|