'చింతకాయల రవి' చిత్రం విడుదలై సుమారు ఆరు నెలలు దాటుతున్నా విక్టరీ వెంకటేష్ నటించిన కొత్త చిత్రమేదీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ గ్యాప్ లో ఆయన జాతీయ నటుడు కమల్ హాసన్ తో కలిసి 'ఈనాడు' చిత్రంలో నటించారు. హిందీలో విజయవంతమైన 'ఎ వెన్స్ డే'కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న 'నమో వెంకటేశ' చిత్రానికి వెంకటేష్ కమిట్ అయ్యారు. 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్, ఆచంట రాము సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ఈనెల 26 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. తొలుత హైద్రాబాద్ లో కొద్ది రోజుల షూటింగ్ అనంతరం చిత్రయూనిట్ యూరప్ వెళ్తుంది. 30 రోజుల భారీ షెడ్యూల్ కు యూరప్ లో ప్లాన్ చేశారు.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. 'ఆడవారి మాటలకు ఆర్థాలు వేరులే' చిత్రం సక్సెస్ తర్వాత వెంకీ-త్రిష కలిసి మరోసారి ఈ చిత్రింలో నటించనుండటం విశేషం. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం తర్వాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించనున్న చిత్రానికి కూడా వెంకటేష్ కమిట్ అయ్యారు. దీనికి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.