రవితేజతో తమిళ తారలు
రవితేజ ప్రస్తుతం నటిస్తున్న 'ఆంజనేయులు' తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా 'నాడోడిగల్' రీమేక్ కు రెడీ అవుతున్నారు. తమిళంలో ఇటీవల విడుదల విజయఢంకా మోగించిన 'నాడోడిగల్' చిత్రం తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ గట్టి పోటీ మధ్య ఇటీవల సొంతం చేసుకున్నారు. స్నేహం కథాంశంగా సముతిరాకని దర్శకత్వంలో మైఖేల్ రాయప్పన్ తమిళంలో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ భాషల్లోనూ రీమేక్ చేసేందుకు సముతిరాకని సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తికరంగా తెలుగు వెర్షన్ కు సముతిరాకని దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ కథానాయుకుడు కాగా, ఆయన స్నేహితుల పాత్రల్లో లారెన్స్, అల్లరి నరేష్, నవదీప్ నటించబోతున్నారు. దీనికి తోడు తమిళ వెర్షన్ లో నటించిన పలువురుని కూడా ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్టు తెలిసింది.
తమిళ వెర్షన్ కథానాయకుడైన శశికుమార్, దర్శకుడు సముతిరాకని గెస్ట్ రోల్స్ పోషించనున్నారనీ, అలాగే తమిళంలో హీరో చెల్లెలి పాత్రలో నటించిన అభినయ మళ్లీ తెలుగులో అదే పాత్ర పోషించుందనీ తెలుస్తోంది. హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయిని పరిచయం చేయనున్నారు. అన్నట్టు...ఈ చిత్రాన్ని కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ తోనూ, హిందీలో దేవ్ పటేల్ ('స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్)తోనూ తీసేందుకు సముతిరాకని సంప్రదింపులు జరుపుతున్నారు.
Be first to comment on this News / Article!
|