'కాసుకో'మంటున్న శ్వేత
కేవలం రెండు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటిగా శ్వేత బసు ప్రసాద్ ను చెప్పుకోవచ్చు. 'కొత్త బంగారులోకం'లో పదహారణాల తెలుగమ్మాయిగా తన చిలిపి మాటలతో అలరించిన శ్వేత ఇటీవలే 'రైడ్' చిత్రంలో మోడ్రన్ గాళ్ గా నటించి అలరించింది. ఇప్పుడు మరోసారి 'కాసుకో' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి ('సీమశాస్త్రి' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'కాసుకో' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. తొలుత 'స్పీడ్' అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో వైభవ్ కు జోడిగా శ్వేతబసు నటిస్తోంది. కె.ఫిలిమ్స్ బ్యానర్ పై కోదండరామిరెడ్డి సమర్పణలో ఎ.భారతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వైభవ్ తొలిచిత్రం 'గొడవ'ను కూడా కోదండరామిరెడ్డి నిర్మించారు. ఆ చిత్రం తర్వాత 'సరోజ' అనే చిత్రంలో వైభవ్ నటించారు. 'కాచుకో' చిత్రం హీరోగా తనకు సరైన బ్రేక్ వస్తుందని వైభవ్ ధీమాగా ఉన్నారు. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈచిత్రంలో బ్రహ్మానందం, సలీమ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, టార్జాన్, అజాద్, శ్రావణ్ తదితరులు నటిస్తున్నారు. ఆగస్టు చివర్లో కానీ సెప్టెంబర్ ప్రథమార్థంలో కానీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు వస్తుంది.
Be first to comment on this News / Article!
|