'వెంగమాంబ'కు ప్రేక్షకాదరణ
వి.ఎం.సి.ప్రొడక్షన్స్ నుంచి తాము రూపొందించిన 'వెంగమాంబ' చిత్రానికి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోందని నిర్మాత దొరస్వామి రాజు సంతోషం వ్యక్తం చేశారు. మీనా టైటిల్ పాత్రలో, సాయికిరణ్ శ్రీ వేంకటేశ్వర స్వామిగా ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో ఈ చిత్రం సక్సెస్ మీట్ ను చిత్రయూనిట్ మంగళవారంనాడు నిర్వహించింది.
దొరస్వామి రాజు మాట్లాడుతూ, సినిమా విడుదలై నాలుగు రోజులైందనీ, అన్ని చోట్ల నుంచీ అద్భుతమైన స్పందన వస్తోందనీ చెప్పారు. సినిమా బాగుందంటూ వెబ్ సైట్స్ లో రివ్యూలు వచ్చాయనీ, వాటిని చూసి అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయనీ తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రం రాలేదని ప్రేక్షకులంటున్నారనీ, ఏ స్థాయి హిట్ అవుతుందో మాత్రం ఇప్పుడే చెప్పలేననీ అన్నారు. 'వెంగమాంబ' చిత్రాన్ని ఆడియెన్స్ మళ్లీ మళ్లీ చూస్తున్నారని దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెలిపారు. మొన్న తాను ఏలూరులో థియేటర్ కు వెళ్లినప్పుడు ఫస్ట్ షో చూసిన 30 మంది మహిళలు మళ్లీ సెకెండ్ షో కోసం టిక్కెట్లు కొనుక్కోవడం తాను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. 'అన్నమయ్య' చిత్రం ద్వారా తాళ్లపాక లాలిపాటను వెంకటేశ్వరస్వామికి సమర్పించిన దొరస్వామిరాజు ఇప్పుడు తరిగొండ ముత్యాల హారతిని స్వామికి కానుకగా అందజేశారని అన్నారు. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. సాయికిరణ్ మాట్లాడుతూ, 'శివలీలలు' సీరియల్ ద్వారా తనను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేసిన ఉదయ్ భాస్కర్ ఇప్పుడు 'వెంగమాంబ' ద్వారా తన కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చారని అన్నారు. వేంకటేశ్వర స్వామి పాత్ర పోషించడం నటుడిగా తనకు ఓ వరమని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు సక్సెస్ మీట్ లో పాల్గొన్న రంగనాథ్, గాయకుడు వి.రామకృష్ణ, కృష్ణవేణి, శివపార్వతి, రాగిణి, అనంత్, అశోక్ కుమార్, గుండు సుదర్శన్ తెలిపారు.
Be first to comment on this News / Article!
|