'ఆ ఇంట్లో' సక్సెస్: చిన్నా
'ఆ ఇంట్లో' చిత్రం దర్శకుడుగా తనకు మంచి పేరు తెచ్చిందని చిన్నా తెలిపారు. చిన్నా ప్రధాన పాత్రను పోషించడంతో పాటు యు9 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కొందరు మిత్రులతో కలిసి 'ఆ ఇంట్లో' చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో మంగళవారం నిర్వహించారు. చిన్నాతో పాటు చిత్ర సంగీత దర్శకుడు కోటి, సౌండ్ ఇంజనీర్ మధుసూదనరెడ్డి, నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
చిన్నా మాట్లాడుతూ, 120 సినిమాల్లో నటించిన తనకు దర్శకుడిగా ఇది తొలి చిత్రమనీ, ఈ చిత్రంలో తాను నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, కథకుడుగా...మొత్తం 7 బాధ్యతలు నిర్వహించాననీ చెప్పారు. అనుకున్న బడ్జెట్ లో మంచి సాంకేతిక నిపుణులతో కచ్చితమైన ప్లానింగ్ ప్రకారం సినిమా పూర్తి చేశాననీ, సినిమా బాగుందంటూ ప్రశంసలు వస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు.
చిన్న చిత్రమైన పెద్ద చిత్రంగా అనిపించుకుంటోదనీ, ఇలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు తీసేందుకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇమేజ్ ను కాకుండా కథను తీసిన చిత్రమనిదనీ, నిర్మాతగా కూడా ఈ చిత్రం తనను నిరాశపరచదనే గట్టి నమ్మకం ఉందనీ అన్నారు. చిన్న చిత్రాలకు ఎదురవుతున్న కష్టాలు స్వీయానుభవం ద్వారా తెలుసుకోగలిగానని చెప్పారు. ఇది దెయ్యం సినిమా కాదనీ, పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే కుటుంబ కథాచిత్రమనీ కోటి పేర్కొన్నారు. ఇందులో సందర్భానుసారమైన రెండు పాటలు ఉన్నాయన్నారు. చిన్నాతో తనకు 'శివ', 'మధురానగరిలో' చిత్రాల నుంచి తనకు స్నేహం ఉందనీ, మంచి హోమ్ వర్క్ తో చిన్నా ఈ చిత్రాన్ని మలిచారని మధుసూధన్ రెడ్డి తెలిపారు. రెగ్యులర్ సిమాలకు భిన్నంగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటోందనీ, మరింతగా ఆదరించాలనీ శ్రీనివాసరెడ్డి కోరారు.
Be first to comment on this News / Article!
|