'మల్లన్న'కు డేట్ ఫిక్స్...
విక్రమ్ 'మల్లన్న' చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడింది. సుమారు రెండేళ్ల పాటు నిర్మాణం జరుపుకొన్నఈ చిత్రం తెలుగు, తమిళ (కందస్వామి) భాషల్లో ఏకకాలంలో ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది.. విక్రమ్, శ్రియ జంటగా సుమారు 40 కోట్ల భారీ బడ్జెట్ తో కలైపులి ధాను ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశీ గణేషన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు తొలుత నిర్ణయించినప్పటికీ మరో వారం ఆగి 'ఇండిపెండెన్స్ డే'న విడుదల చేయడం సముచితంగా ఉంటుందని చిత్రయూనిట్ తుది నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అసమానతలకు సంబంధించిన కథాంశం కావడంతో దేశభక్తి పాళ్లు ఈ చిత్రంలో ఎక్కువనీ, ఇందువల్ల స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేయడం వల్ల విస్తృత స్థాయిలో ఆడియెన్స్ కు చేరువయ్యే అవకాశాలున్నాయనీ యూనిట్ అభిప్రాయపడుతోంది.
ఉన్నవారు అంతకంతకూ ఎదిగిపోతుంటే లేనివారు అంతకంతకూ కృంగిపోతున్నారనీ, ఈ ఆర్థిక అసమానతలకు కారణం ఏమిటని ఆలోచించి పేదరికంపై పోరాట సాంగించిన ప్రభుత్వాధికారి కథే 'మల్లన్న'. సిబిఐలో ఆర్థిక నేరాల విభాగాన్ని పర్యవేక్షించే అధికారిగా విక్రమ్ కనిపించనున్నారు. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ఆదర్శ భావాలు గల అమ్మాయిగా శ్రియ నటించారు. సూపర్ స్టార్ కృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో విక్రమ్ 5 గెటప్స్ లలో కనిపించడంతో పాటు లేడీ గెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, రాబిన్ హుడ్ తరహా పాత్రలో విక్రమ్ చేసే పోరాటాలు వైవిధ్యంగా ఉంటాయనీ, అత్యున్నత సాకేంతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కిందనీ సుశీ గణేషన్ చెబుతున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే తెలుగు, తమిళ (కందస్వామి) భాషల్లో సక్సెస్ గా నిలుస్తోంది. విక్రమ్ ఇందులో తన పాటలకు తానే స్వయంగా నేపథ్యగానం అందించడం విశేషం. 'మల్లన్న' రిలీజ్ తేదీ ఖరారు కావడంతో ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న కొన్ని చిత్రాలు తమ రిలీజ్ తేదీల్లో మార్పులు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|