కింగ్ ఖాన్ తో మమతా?
బాలీవుడ్ హీరోలు ఇప్పుడు దక్షిణాది హీరోయిన్లపై మనసు పడుతున్నారు. ప్రతీ హీరో తమ సినిమాల్లో ఓ దక్షిణాది భామను పరిచయం చేయాలని తహతహలాడుతున్నారు. ఇటీవలే ఆసిన్ ను అమీర్ ఖాన్ 'గజనీ'తో బాలీవుడ్ కు సక్సెస్ ఫుల్ గా పరిచయం చేశారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ 'కట్టా మీటా'తో త్రిష బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. 'రావణ్'తో ప్రియమణిని మణిరత్నం హిందీకి పరిచయం చేయబోతున్నారు. జెనీలియా, సదా, శ్రియ వంటి దక్షిణాది భామలకూ హిందీలో సినిమాలున్నాయి. ఇప్పుడు మలయాళీ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ సైతం బాలీవుడ్ బాట పట్టనుంది. అది కూడా కింగ్ ఖాన్ షారూక్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.
బాలీవుడ్ ఎంట్రీ కోసం మమతా మోహన్ దాస్ ఇటీవలే దేశంలోని అత్యుత్తమ ఫోటోగ్రాఫర్లతో ఫోటో షూట్ లో పాల్గొందనీ, ఈ ఫోటో షూట్ కోసం బాలీవుడ్ హీరోయిన్లను తలదన్నేలా మెరుపుతీగలా మారేందుకు గత కొద్ది రోజులుగా క్రాష్ డైట్ చేస్తోందనీ సినీ వర్గాల భోగట్టా. ప్రముఖ కొరియాగ్రాఫర్ కమ్ డైరెక్టర ఫరాఖాన్ ను ముంబైలో ఇటీవల మమత కలుసుకుందట. ఫరాఖాన్ తదుపరి చిత్రమైన 'హ్యాపీ న్యూ ఇయర్' లో షారూక్ సరసన నటించే అవకాశం కోసం మమత ఎంతో ఉత్సకతో ఎదురు చూస్తోంది. ఇటీవలే 'ఓం శాంతి ఓం'తో దీపిక పడుకొనేకు ఫరాఖాన్ మంచి బ్రేక్ ఇచ్చారు. మమత సైతం బాలీవుడ్ ఛాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇతర భాషా చిత్రాలను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటోంది. తెలుగులో 'కింగ్' తర్వాత మరో చిత్రానికి కమిట్ కాని మమత తన మాతృభాష మలయాళంలో మాత్రం మోహన్ లాల్, దిలీప్, పృధ్వీరాజ్ ల సరసన 3 చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా మూడు వారాల్లోపు మలయాళ సినిమాలు పూర్తి చేసి అట్నించి అటే ముంబై ఫ్లైట్ ఎక్కేస్తుందట. 'కింగ్' తర్వాత కింగ్ ఖాన్ తో నటించే ఛాన్స్ మమతను వరించడమంటే గ్రేట్ అచీవ్ మెంట్ కిందే లెక్క...
Be first to comment on this News / Article!
|