కాజల్ ను తరిమిన చరణ్
కాజల్ వంటి ఏంజిల్ కనిపిస్తే ఆమె కంట్లో పడాలనీ, వీలుంటే ఓ మాట కలపాలనీ కుర్రకారుకు అనిపించడం సహజం. రామ్ చరణ్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న అమ్మాయి ఆమేనని కాజల్ ను చూడగానే ఆయనకు అనిపించిందట. అప్పటికే కాజల్ అందుబాటులో ఉన్న బస్సు ఎక్సేసింది. చరణ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయదలచుకోలేదు. పక్కనే అందుబాటులో ఉన్న గుర్రం పగ్గాలు చేతిలోకి తీసుకుని ఆమెను ఛేజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ ఛేజ్ చూసి విస్తుపోవడం జనం వంతైంది. ఫన్నీగా ఉంది కదూ?!. రామ్ చరణ్ పడిన ఈ ప్రయాసంతా 'మగధీర' సినిమా కోసమే. కథానాయిక కాజల్ కు సినిమాలో నచ్చిన సన్నివేశం కూడా ఇదేనట. కాజల్ స్వయంగా చెప్పుకొచ్చింది. 'అంతమంది జనంలో నేనే అతనికి కావాల్సిన అమ్మాయనని గుర్తించి నన్ను ఛేజ్ చేయడం ఫన్నీగా లేదూ. నాకే కాదు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు' అంటూ కాజల్ ఒకింత ఉద్వేగంతో చెప్పింది.
కాజల్ ఈ చిత్రంలో ఫ్యాషన్ డిజైనర్ గా, నాలుగువందల ఏళ్ల క్రితం నాటి ప్రిన్సెస్ గా ద్విపాత్రాభినయం చేసింది. టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్ లో నటించే అవకాశం కోరుకున్నప్పుడల్లా రాదనీ, కెరీర్ లో అరుదుగా వచ్చే అవకాశం తనకు రావడం అదృష్టమనీ కాజల్ చెప్పుకొచ్చింది. ఇందుకోసం తాను పడిన కష్టాన్ని వివరిస్తూ 'ఈ సినిమా కోసం రోజుకు 14 గంటలు కష్టపడేదాన్ని. ప్యాకప్ తర్వాత డాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ముఖ్యంగా ధీర..ధీర..మగధీర పాటలో క్లాసికల్ డాన్సర్ గా కనబడటం కోసం ఈ ప్రాక్టీస్ తప్పనిసరి అయేది. 400 ఏళ్ల క్రితం నాటి లవ్ స్టోరీలో హీరోయిన్ లా కనిపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎక్కువ ఎమోషన్స్ కళ్లతోనే కనబరచాల్సి రావడంతో బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవాల్సి వచ్చింది. ఒకరోజు ప్రిన్సెస్ గా కనిపించాల్సి వస్తే, ఆ మరుసటి రోజే కాలేజీ అమ్మాయిలా నటించాల్సి వచ్చేది. ప్రతి రోజూ మేకప్ కు రెండు గంటలకు పైగా పట్టేది. షూటింగ్ తర్వాత ఇంట్లో కూడా కొంత హోమ్ వర్క్ చేసేదాన్ని. రాజ్ కపూర్, నర్గీస్ కలిసి నటించిన చిత్రాలు చూసి వారి మధ్య కెమెస్ట్రీ పండటానికి కారణాలు గ్రహించే దాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే...ఏదో నటించామంటే నటించామని కాకుండా చాలా ఇష్టపడి అంతకంటే ఎక్కువ కష్టపడి ఈ సినిమా చేశాను. ఆ కష్టం తెరపై కనిపిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాను' అని కాజల్ ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. కాజల్ యాక్షన్ కు ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో 'మగధీర' రిలీజ్ తర్వాతే తేలుతుంది.
Be first to comment on this News / Article!
|