నిర్మాతగా రామ్ చరణ్
రామచరణ్ తేజ తన రెండో సినిమా 'మగధీర'తో పలు రికార్డులు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి 15 దేశాల్లో 1500 థియేటర్లలో ఈనెల 29న 'మగధీర' విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి 40 కోట్ల భారీ బడ్జెట్ తో పీరియాడిక్ ఫిల్మ్ గా ఈ చిత్రం రూపొందడం, పూర్తి వాణిజ్య విలువలు, అత్తున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ చిత్రాన్ని మరపించే రీతిలో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం మరిన్న అంచనాలకు తావిస్తోంది. రెండేళ్ల సినీ కెరీర్ లో కేవలం రెండో చిత్రంతోనే ఇంతటి సంచలనాలకు కారణమవుతున్న రామ్ చరణ్ త్వరలో సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు.
'సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాలనుకుంటున్నాను. త్వరలోనే ఇది ఉంటుంది. ఈ బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించి పరిశ్రమలో వారికి అవకాశం కల్పిస్తాం. కమర్షియల్ సినిమాలతో పాటు ఆఫ్ బీట్ సినిమాలు కూడా ఈ బ్యానర్ లో ఉంటాయి' అని రామ్ చరణ్ తెలిపారు. ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ నుంచి రెండు భారీ ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. చరణ్ మేనమామ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిన్నటి 'గజనీ' (హిందీ) నేటి 'మగధీర'తో సహా ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ఇక చరణ్ బాబాయ్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇంతవరకూ 6 చిత్రాలు నిర్మించారు. 7వ చిత్రంగా చరణ్ తదుపరి చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందించనున్నారు. అంజనా, గీతా ఆర్ట్స్ సంస్థలు బిగ్ బ్యానర్లుగా ఉండగా, చరణ్ సొంత నిర్మాణ సంస్థను స్థాపించి యంగ్ టాలెంట్ కు అవకాశం కల్పిస్తామనడం ఆహ్వానించదగ్గ పరిణామం.
Be first to comment on this News / Article!
|