ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన యాక్షన్ తో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్ ఏర్పరచుకున్న రవితేజ ఈ ఏడాది 'కిక్' తెచ్చిన సక్సెస్ తో మరిన్న వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం 'ఆంజనేయులు' చిత్రం షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు. దీని తర్వాత బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న 'నాడోడిగల్' రీమేక్ కు కమిట్ అయ్యారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. 80వ దశకంలో రాజేంద్రప్రసాద్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన 'లేడీస్ టైలర్' చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం ఉండబోతోంది. దీనికి 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే టైటిల్ పెడుతున్నారు.
వంశీ-రవితేజ కాంబినేషన్ లో గతంలో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' వంటి హిట్ చిత్రాన్ని అందించిన మహర్షి సినిమా పతాకంపై వల్లూరి పల్లి రమేష్ ఈ తాజా చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ తో కలిసి నిర్మించనున్నారు. ఇటీవలే వంశీ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్, మహర్షి సినిమా సంయుక్తంగా నిర్మించిన 'గోపి గోపిక గోదావరి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ 'ఫ్యాషన్ డిజైనర్' చిత్రానికి సమాయత్తమవుతోంది. 2010 జనవరిలో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది.