రచయితగా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారిన పోసాని కృష్ణమురళి ఇప్పుడు 'జెంటిల్ మన్' అనిపించుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఇంతవరకూ మాట పెలుసు అనిపించుకుంటూ వచ్చిన పోసాని అందుకు తగ్గట్టే ఈమధ్యనే 'మెంటల్ కృష్ణ' అవతారమెత్తారు. 'రాజావారి చేపల చెరువు' అంటూ ప్రేక్షకులపై పొలిటికల్ సైటైర్ విసిరారు. ఇప్పుడు కంప్లీట్ గా ఇమేజ్ ఛేంజోవర్ ఆలోచనలో పడ్డారు. దానిని ప్రతిబింబించేలా ఆయన తన కొత్త చిత్రానికి 'జంటిల్ మన్' అనే టైటిల్ ను ఎంచుకున్నారు. పోసాని స్యయంగా దర్శకపగ్గాలు చేపడుతూ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని వీరభద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లం పద్మజ నిర్మించబోతున్నారు. పోసానికి జోడిగా ఆర్తి అగర్వాల్ నటించనుంది.
తొలి ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఒప్పుకున్న చిత్రాల్లో 'జంటిల్ మన్' ఒకటి. ఇది 'పవిత్రబంధం' తరహాలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందనీ, 'మెంటల్ కృష్ణ'లో పోసాని శాడిస్ట్ భర్త పాత్రకు భిన్నంగా కొత్త చిత్రంలో ఆయన పాత్ర ఉంటుందనీ చెబుతున్నారు. ఈ శుక్రవారమే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.