'అడవి' ఆడియో 25న
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మిస్టరీ థ్రిల్లర్ 'అడవి' విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో 'అడవి', హిందీలో 'అగ్యాత్' పేరుతో ఆగస్టు 7న ఏకకాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యువహీరో నితిన్ తొలిసారి హిందీకి పరిచయమవుతున్న ఈ చిత్రంలో నిషా కొఠారి అలియాస్ ప్రియాంక కొఠారి హీరోయిన్ గా నటిస్తోంది. యూటీవీ మోషన్ పిక్చర్స్, డ్రీమ్ ఫోర్స్ ఎంటర్ ప్రైజెస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తూ ఆంధ్రదేశమంతటా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
నట్టికుమార్ ఆ వివరాలను తెలియజేస్తూ, వర్మ చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమనీ, ఈ చిత్రం రైట్స్ కు గట్టి పోటీ ఎదురైనా వర్మ తనమీద, తన ప్రమోషన్ వర్క్ మీద ఉన్న నమ్మకంతో రైట్స్ ఇచ్చారనీ చెప్పారు. సహజంగా ఎవరైనా సినిమా రిలీజ్ తర్వాతే ప్రమేషన్ పై ఎక్కువ దృష్టి పెడుతుంటారనీ, అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల జరిపే ప్రమోషన్ వర్క్ లో వర్మ పాల్గొంటారనీ చెప్పారు. చిత్ర కథాంశానికి వస్తే ఒక అడవిలో షూటింగ్ కోసం వెళ్లిన ఓ చిత్ర యూనిట్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందనేది ఇందులో దర్శకుడు చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. తొలిసారి బాలీవుడ్ కు పరిచయమవుతున్న నితిన్ ఈ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తారు. అడవికి వెళ్లిన యూనిట్ సభ్యులు ఒక్కొక్కరిని ఓ అజ్ఞాత శక్తి చంపేస్తుంటుంది. అందరికీ ధైర్యం చెప్పాల్సిన హీరో భయపడిపోతుంటాడు. దీంతో అసిస్టెంట్ దర్శకుడే నాయకుడై అందరిలో ధైర్యం నింపి వారిని ముందుకు నడిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుందనీ, ఈనెల 25న ఆడియో విడుదల చేయబోతున్నామనీ నట్టికుమార్ తెలిపారు.
Be first to comment on this News / Article!
|