పవన్ బర్త్ డేకి 'పులి' సాంగ్స్
మెగా ఫ్యామిలీ హీరోల సందడి మొదలైంది. రామ్ చరణ్ ఈనెల 29న 'మగధీర'గా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు 'పరుగు'తో 'ఐడియా ఫిల్మ్ ఫేర్ ' బెస్ట్ హీరో రేసులో ఉన్న అల్లు అర్జున్, 'జల్సా'తో నంది అవార్డుకు అవకాశమున్న పవన్ కల్యాణ్ తమ కొత్త చిత్రాలతో రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆర్య 2' ఆగస్టులో రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతుండగా, పవన్ కల్యాణ్ 'కొమురం పులి' సైతం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటూ దీపావళి కానుకగా అక్టోబర్ లో విడుదల చేసేందుకు ఆ చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య కృతనిశ్చయంతో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం పవన్ 'కొమురం పులి' ఆడియో వేడుక ఆయన బర్త్ డే రోజైన అక్టోబర్ 2న జరుగనుంది.
'జల్సా' తర్వాత 'కొమురం పులి' షూటింగ్ వెంటనే ప్రారంభమైనప్పటికీ పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో షూటింగ్ కు అంతరాయం కలిగింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ ఊపంకుంది. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్ల చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ అత్యద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారనీ, సినిమాలో ఆరు పాటల్లో మరో రెండింటికి ఆయన ట్యూన్స్ ఇవ్వాల్సి ఉందనీ తెలుస్తోంది. మహేష్ 'నాని' తర్వాత ఎస్.జె.సూర్య-రెహ్మాన్ కాంబినేషన్ లో వస్తున్న సాంగ్స్ కావడంతో సహజంగానే ఆడియోపై మంచి అంచనాలు నెలకొన్నాయి. పవన్ పవర్ ఫోలీస్ ఆఫీస్ ర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన డైలాగ్స్ సైతం పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయి. అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టేలా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది. పవన్ కు జోడిగా నిఖిష పటేల్ అనే కొత్తమ్మాయి పరిచయమవుతోంది. ఇతర పాత్రల్లో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, శరణ్య, నాజల్, ఆలీ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయన్ ఫైట్స్, ఆనంద్ సాయి కళా దర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. కనకరత్న మూవీస్ పతాకంపై సింగలమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|