'జెంటిల్ మేన్'కు చిరు క్లాప్
పోసాని కృష్ణమురళి కథానాయకుడుగా, దర్శకుడిగా 'జెంటిల్ మేన్' చిత్రం ప్రారంభమైంది. వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నల్లం శ్రీనివాస్ సమర్పణలో నల్లం పద్మజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోసాకి జంటగా ఆర్తి అగర్వాల్ నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో శుక్రవారం ఉదయం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. పోసాని-ఆర్తి జంటపై తీసిన ముహూర్తం సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చి గౌరవ దర్శకత్వం వహించారు.
పోసాని మాట్లాడుతూ, ఇది భార్యాభర్తల కథాంశమనీ, తన భార్యగా ఆర్తి అగర్వాల్, సెకెండ్ హీరోయిన్ గా నటసా నటిస్తున్నారనీ, ఆర్తి అగర్వాల్ తండ్రి శశాంక్ అగర్వాల్ ఈ చిత్రంలో ఆర్తి తండ్రిగానే నిజజీవిత పాత్రను పోషిస్తుండటం విశేషమనీ చెప్పారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా తన పాత్ర ఉంటుందన్నారు. వివాహ నిశ్చితార్ధం అయినప్పటి నుంచి శోభనం వరకూ ఆ స్త్రీ వెంట మగవాడు ఎందుకు పడతాడు? కొంతకాలం కాపురం తర్వాత ముందు ఉన్న విధంగా భార్యతో ప్రేమగా ఎందుకు ఉండలేకపోతాడనే విషయాలను ఈ చిత్రంలో చర్చించబోతున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి ఏకథాటిగా 35 రోజుల పాటు జరిపే షూటింగ్ తో సినిమా పూర్తవుతుందని తెలిపారు. ఈ చిత్రంలో ఇంతవరకూ చేయనటువంటి పాత్రను పోషిస్తున్నాననీ, ఇందులో నాన్నగారు శశాంక్ అగర్వాల్ తన తండ్రి పాత్రలోనే నటిస్తుండటం చాలా ఆనందంగా ఉందనీ చెప్పారు. తొలిసారిగా తనకు నటించే అవకాశ ఇచ్చిన దర్శకనిర్మాతలకు తన కృతజ్ఞతలని శశాంక్ అగర్వాల్ పేర్కొన్నారు. వృత్తిరీత్యా మోడల్ అయిన తాను ఈ చిత్రంలో సెకెండ్ లీడ్ పోషిస్తున్నాననీ, హైద్రాబాద్ కు రావడం ఇదే మొదటిసారనీ నటసా తెలిపింది. ఇందులో ఆర్తి అగర్వాల్ స్నేహితురాలిగా తాను నటిస్తున్నాననీ, భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే పాత్ర తనదనీ నటి సురేఖావాణి తెలిపింది. చిత్ర సమర్పకుడు నల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు తాను చిన్నప్పటి నుంచి పోటీపడే చూసేవాడిననీ, ఇప్పుడు తాను తీస్తున్న చిత్రానికి చిరంజీవి క్లాప్ ఇవ్వడం మరచిపోలేని అనుభూతినిచ్చిందనీ చెప్పారు. మానవ సంబధాల మధ్య నడిచే కథగా ఈ చిత్రాన్ని పోసాని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడు మల్లికార్జున శర్మ, పాటల రచయిత పైడిశెట్టి రామ్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జితిన్, నాగేంద్రబాబు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|