ప్రేమ కథతో 'విధేయుడు'
'ఆ నలుగురు', 'వినాయకుడు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ప్రేమ్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం 'విధేయుడు'. ప్రేమకుమార్ పట్రా సమర్పణలో సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిమీర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నందు, రచనా మల్హోత్రా హీరోహీరోయిన్లు. మణికొండలోని ఓ అపార్ట్ మెంట్ లో జరుగుతున్న షూటింగ్ గురువారంతో పూర్తయింది. షూటింగ్ స్పాట్ లోనే చిత్రయూనిట్ చిత్ర విశేషాలను తెలియజేసింది.
ప్రేమ్ కుమార్ పట్రా మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా చేశామనీ, ఈరోజుతో షూటింగ్ పూర్తయిందనీ చెప్పారు. ప్రేమ చుట్టూ తిరిగి కథ ఇదనీ, కేవలం కథను నమ్ముకుని తీసిన చిత్రమిదనీ చెప్పారు. 90 శాతం వినోదం, పది శాతం ఎమోషన్స్ ఉన్న చిత్రమిదని తెలిపారు. 'వినాయకుడు' సినిమా రషెస్ చూసినప్పుడు యావరేజ్ గా ఆడుతుందని అనుకున్నామనీ, అయితే మంచి విజయం సాధించిందనీ, 'విధేయుడు' రషెస్ చూసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం కలిగిందనీ చెప్పారు. ఆదిత్య, గుణశేఖర్ వంటి దర్శకుల వద్ద పనిచేసిన సాయిమీరాను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నామనీ, అలాగే తమిళ సంగీత దర్శకుడు కార్తీక్ ను తెలుగులో పరిచయం చేస్తున్నామనీ, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారనీ చెప్పారు. 'వినాయకుడు' చిత్రానికి ఆపరేటివ్ కెమెరామన్ గా పనిచేసిన రాజేంద్ర కేశని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారని తెలిపారు. హీరో నందు, హీరోయిన్ రచనా మల్హోత్రాకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఎం.ఎస్.ఆర్ట్స్ బ్యానర లో దర్శకత్వ విభాగంలో తాను పనిచేశాననీ, ఈ చిత్ర కథ చెప్పగానే తన మీద ఉన్న నమ్మకంతా నిర్మాతలు తనకు దర్శకుడిగా అవకాశమిచ్చారనీ సాయిమీరా తెలిపారు. మంచి బ్యానర్ లో పనిచేయడం తమకు చాలా సంతోషంగా ఉందని నందు, రచన మల్హోత్రా తెలిపారు. ఛాయాగ్రాహకుడు రాజేంద్ర కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ చిత్రానికి వనమాలి పాటలు, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|